Britain New King : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.
ఛార్లెస్ సతీమణి క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్(73) పేరును అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరించారు. సంబంధిత పత్రంపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు.
నా విధుల గురించి పూర్తి అవగాహనతో ఉన్నా..
ఒక రాజుగా తన బాధ్యతల గురించి పూర్తి అవగాహనతో ఉన్నానని ఛార్లెస్ వెల్లడించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి (ఎలిజబెత్) జీవితకాలం నిస్వార్థ సేవ, ప్రేమ అందించి, నిదర్శనంగా నిలిచారన్నారు. అలాగే తన సతీమణి కెమిల్లా తనకెప్పుడూ మద్దతుగా ఉన్నారని చెప్పారు.
ప్రకటన వెంటనే వెలువడినా రాజు పట్టాభిషేకానికి మాత్రం.. కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. పట్టాభిషేకానికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణమని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్‌ను 1952 ఫిబ్రవరిలో రాణిగా ప్రకటించగా.. పట్టాభిషేకం 1953 జూన్‌లో జరిగింది. 900 ఏళ్లుగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్ అబేలోనే.. ఈసారి ఛార్లెస్ ప్రమాణ స్వీకారం జరగనుంది.
పట్టాభిషేకంలో మతపరమైన క్రతువు ముగిసిన తర్వాత.. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని ఛార్లెస్ తలపై అలంకరిస్తారు. పూర్తిగా బంగారంతో చేసిన ఈ కిరీటాన్ని 1661లో తయారు చేశారు. ఈ కిరీటాన్ని పట్టాభిషేకం సమయంలో మాత్రమే ధరిస్తారు. ఇది 2.23 కిలోల బరువు ఉంటుంది. ఈ పట్టాభిషేకంతో బ్రిటన్ 40వ రాజుగా ఛార్లెస్ చరిత్ర పుటల్లో నిలవనున్నారు. రాజుగా స్కాట్లండ్ చర్చిని పరిరక్షిస్తానని పట్టాభిషేకం సమయంలో ఛార్లెస్ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార సంప్రదాయం 18వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది.
ఇకపై రాజును.. కింగ్ ఛార్లెస్-3 పేరుతో, ఆయన భార్య కామిలాను క్వీన్ కాన్సర్ట్ పేరుతో వ్యవహరిస్తారు. 240 కోట్ల జనాభా ఉన్న 56 స్వతంత్ర దేశాల కామన్‌వెల్త్ కూటమికి ఛార్లెస్ నాయకుడు అవుతారు. వీటిలో 14 దేశాలకు, బ్రిటన్‌కు ఆయన అధినేతగా ఉంటారు.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా విలియం.. రాణి ఎలిజబెత్ మరణంతో రాజకుటుంబంలో వారసుల హోదాలు మారాయి. ఛార్లెస్ రాజుగా బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన పెద్ద కుమారుడు విలియం యువరాజు అయ్యారు. దీంతో ఇకపై ఆయనను ప్రిన్స్ ఆఫ్ వేల్స్, విలియం సతీమణి కేట్ మిడిల్టన్‌ను ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు కింగ్ ఛార్లెస్ తన ప్రసంగంలో అధికారికంగా ప్రకటించారు. ఛార్లెస్ తన జీవితంలో ఎక్కువ కాలం వేల్స్ యువరాజుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన మొదటి భార్య డయానా ఇప్పటివరకు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌గా ఉన్నారు. డయానా మరణానంతరం ఛార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నప్పటికీ.. వేల్స్ యువరాణి హోదాను మాత్రం ఆమె స్వీకరించలేదు. డయానా గౌరవార్థం అలాగే కొనసాగించారు. ఇప్పుడు ఆ హోదా కేట్‌కు దక్కింది.
ఇక, రాచరికాన్ని వదులుకున్న తన రెండో కుమారుడు హ్యారీని కూడా కింగ్ ఛార్లెస్ తన ప్రసంగంలో తలుచుకున్నారు. హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌పై తనకు ఎంతో ప్రేమ ఉందని, విదేశాల్లో వారి జీవితం హాయిగా కొనసాగాలని ఆకాంక్షించారు. హ్యారీ దంపతులు రాచరికాన్ని వదులుకున్నప్పటికీ వారి కుమారుడు అర్చి మౌంట్‌బాటన్-విండ్సర్ సాంకేతికంగా కొత్త ప్రిన్స్‌గా, ఆయన సోదరి లిలిబెట్ ప్రిన్సెస్‌గా అవతరించారని స్థానిక మీడియా పేర్కొంది.
ఏడు దశాబ్దాలకుపైగా బ్రిటన్‌ను పాలించిన ఎలిజబెత్-2... స్కాట్లాండ్లోని తన వేసవి విడిది బల్మోరల్ క్యాజిల్‌లో గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ఇవీ చూడండి: 'కోహినూర్' వజ్రం.. ఇక ఆమె సిగపై..!
రెండు వారాల్లో ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. 50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో..