Jill Biden Ukraine trip: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆదివారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనాతో సమావేశమైన జిల్ బైడెన్.. యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. వీరు ఇరువురు ఉక్రెయిన్- స్లొవేకియా సరిహద్దుల్లోని గ్రామంలో సమావేశమైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గ్రామంలోని ఓ పాఠశాలలో కలుసుకొని మాట్లాడుకున్నట్లు వివరించింది. తొలుత స్లొవేకియాలోని ఓ పట్టణానికి చేరుకున్న జిల్ బైడెన్.... అక్కడి నుంచి వాహనంలో ఉక్రెయిన్ సరిహద్దు గ్రామానికి చేరుకున్నారు. అంతకుముందు, స్లొవేకియా ప్రధాని ఎడ్వర్డ్ హీగర్‌తో మాట్లాడిన జిల్ బైడెన్... ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
'మదర్స్ డే రోజునే నేను ఇక్కడికి రావాలనుకున్నా. అమెరికా పౌరులు ఉక్రెయిన్ ప్రజల పక్షాన ఉన్నారని చాటి చెప్పడం చాలా ముఖ్యం. ఈ దారుణమైన యుద్ధం ఆగాల్సిన అవసరం ఉంది' అని జిల్ బైడెన్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత చర్చల అనంతరం రిపోర్టర్లతో మాట్లాడారు. జిల్ బైడెన్ పర్యటనను స్వాగతించిన ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా... ఆమె తమ దేశానికి రావాలని తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు.
Justin Trudeau in Ukraine: మరోవైపు, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సైతం ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఇర్పిన్ నగరాన్ని ఆయన సందర్శించారని ఉక్రెయిన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. నగర మేయర్ ఒలెగ్జాండర్ మార్కుషిన్ ట్రూడో పర్యటనను ధ్రువీకరించారు. అయితే, కెనడా అధికారులు మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో పోలండ్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఉక్రెయిన్‌కు రాలేకపోవడంపై బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నారని శ్వేతసౌధం సైతం వెల్లడించింది. అయితే, ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం కాలేదని గతవారం పేర్కొంది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి!