ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్- 2020 పేరును 'నవా-ఇ-అఫ్గాన్- జిహాద్' నుంచి 'నవా-ఎ-గజ్వా-ఇ-హింద్'గా మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గాన్ నుంచి కశ్మీర్ వరకు తిరిగి దృష్టి పెట్టాలని ఆ పేరు సూచిస్తున్నట్లుగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గత ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్ అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత మళ్లీ వాటి దాడులు పెరుగుతున్నట్లు ఐరాస అభిప్రాయపడింది.
ప్రస్తుతం అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ.. అఫ్గానిస్థాన్‌లో తక్కువ ప్రభావాన్నే కలిగి ఉన్నా.. ఆ సంస్థలో ఉగ్రవాదుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందని ఐరాస తన నివేదికలో పేర్కొంది. 180 నుంచి 400 మంది వరకు ముష్కరులు ఉన్నట్లు అంచనా వేసింది. వీరిలో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిపింది. 2015లో అగ్రరాజ్యం, అఫ్గాన్ సంయుక్తంగా కాందహార్‌లో జరిపిన దాడిలో ఏక్యూఐఎస్‌కు ఉన్న సామర్థ్యం కంటే ప్రస్తుతం ఇంకా బలహీనపడినట్లు అంచనా వేసింది. అయితే.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా.. అఫ్గానిస్థాన్‌లోని పలు రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. వారిలో కొంత మంది నేరుగా తాలిబన్ నియంత్రణలో ఉన్నట్లు పేర్కొంది. నంగర్హార్ ప్రాంతంలో జైషే ఉగ్రసంస్థ 8 క్యాంపులు నిర్వహిస్తుండగా.. అందులో మూడు తాలిబన్ల నియంత్రణలో ఉన్నట్లు తెలిపింది నివేదిక.
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు, తాలిబన్ల మధ్య ప్రస్తుతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఐరాస తెలిపింది. దీంతో మళ్లీ ఉగ్ర సంస్థ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఫలితంగా రానున్న రోజుల్లో ఉగ్ర ముప్పు ఉండొచ్చని అంచనా వేసింది. అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఐమన్ ముహమ్మద్ రబీ అల్ జవహిరి అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నట్లు తెలిపింది. సంస్థ కార్యకలాపాలు సైతం ఆ దేశంతో పాటు పాకిస్థాన్‌లోనూ విస్తరిస్తున్నట్లు తన నివేదికలో ఐరాస వెల్లడించింది. ప్రస్తుతం అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ తన మ్యాగజైన్‌లో పేరు మార్పుతో భారత్‌తో సహా ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఐరాస హెచ్చరించింది.
ఇదీ చూడండి: క్వాడ్ హెచ్చరిక.. ఉగ్రవాదంపై పాక్‌కు.. ఇండో పసిఫిక్‌పై చైనాకు!