జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అబే ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావమైంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ కాసేపటికి వెల్లడించారు. అనేక గంటల తర్వాత.. అబే మరణించారన్న వార్తను అక్కడి మీడియా ధ్రువీకరించింది.
షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని నరా నగరానికి చెందిన 41 ఏళ్ల యమగామి టెట్సుయాగా గుర్తించారు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అతడు గతంలో మూడేళ్లపాటు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో పనిచేశాడని స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల తర్వాత పోలీసులు నిందితుడిని ఘటనాస్థలం వద్దే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు గుర్తించారు. ఆ ఆయుధంతోనే దుండగుడు కాల్పులు జరిపి ఉంటాడని అనుమానిస్తున్నారు.
భద్రత గల దేశంలో..: ప్రపంచంలోనే అత్యంత సురక్షితంగా దేశాల్లో ఒకటిగా ఉన్న జపాన్లో ఈ కాల్పులు కలకలం రేపాయి. జపాన్లో తుపాకీ వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అలాంటి దేశంలో ఓ మాజీ ప్రధానిపైనే కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అటు.. కాల్పుల ఘటన క్షమించరానిదని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రచారంలో జరిగిన నేరం క్షమించరానిదని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో ఉన్న ప్రధాని కిషిదతో పాటు ఇతర మంత్రులు ప్రచారం రద్దు చేసుకుని.. టోక్యో చేరుకున్నారు.
మోదీ దిగ్భ్రాంతి: షింజో అబే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. షింజో అబే గొప్ప రాజనీతిజ్ఞుడు, అద్భుతమైన నేత, పాలకుడు అని కొనియాడారు. జీవితం మొత్తాన్ని జపాన్, ప్రపంచ సంక్షేమం కోసమే అంకితం చేశారని మోదీ కితాబిచ్చారు. అబే మృతి నేపథ్యంలో భారత దేశవ్యాప్తంగా జులై 9న సంతాప దినంగా పాటించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయనతో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మోదీ. ఆయన మరణంపై అనేక దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి.
రాహుల్, రాజ్‌నాథ్ సంతాపం: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. భారత్, జపాన్ మధ్య సంబధాలు మెరుగుపరచడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. జపాన్ ప్రజలకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు భారత్ ఓ మంచి మిత్రుడిని కోల్పోయిందన్నారు రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం విషయంలో షింబే అబే పాత్ర ముఖ్యమైనదన్నారు.
షింజో అబే 2006లో తొలిసారి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 2007 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం 2012 నుంచి 2020 వరకు సుదీర్ఘకాలం జపాన్ ప్రధానిగా వ్యవహరించారు. జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తి ఈయనే. 2020లో అనారోగ్య కారణాలతో అబే పదవి నుంచి దిగిపోయారు.
ఇదీ చదవండి:డ్రాగన్‌కు చెమటలు పట్టించిన నేత.. భారత్‌కు మంచి మిత్రుడు!