Israel Palestine War : హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని మోహరించింది. గాజాపై ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి దిగనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. గాజా నగరంలోని ఇస్లామిక్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయెల్ అందులో ఉన్న భవనాలను శిథిలాల గుట్టగా మార్చింది. ఇక్కడ అనేక మంది మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

'1500 మంది హమాస్ ఉగ్రవాదులు హతం'
Israel Hamas Latest News : ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 22వేలకుపైగా ఇళ్లు, 10 ఆస్పత్రులు, 48 పాఠశాలలు ధ్వంసమైనట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 1050 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, 5వేల మందికిపైగా గాయపడ్డారని చెప్పాయి. తమ భూభాగంలో 1500 మందికిపైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా నుంచి హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది.

'గుడారాల నగరంగా గాజా'
Israel Attack On Gaza Latest News : గాజాలో వేలాది భవనాలను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నేలమట్టం చేస్తుండగా త్వరలోనే గాజా గుడారాల నగరంగా మారనుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు వెల్లడించారు. గాజాపై దాడుల్లో హమాస్‌కు చెందిన విమాన నిఘా వ్యవస్థను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కొన్ని భవనాలపై ఉన్న సోలార్ ప్యానళ్ల చాటున ప్రత్యేకమైన కెమెరాలు పెట్టి దీనిని ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ విమానాలు గాల్లో ఉండగానే వాటి కదలికలను హమాస్ ఉగ్రవాదులు వీటి ద్వారా గుర్తిస్తున్నారు. ఇలాంటివి గాజా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. వీటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఐడీఎఫ్ దళాలు ట్విట్టర్‌లో వెల్లడించాయి. ఇప్పటికే హమాస్ నౌకలను ఇజ్రాయెల్ పేల్చివేసింది. గాజా పట్టీలోని మధ్యదరా సముద్రం నుంచి హమాస్ డైవర్లు ఈదుకొంటూ వచ్చి ఇజ్రాయెల్‌లో చొరబడ్డారు. ఈ నేపథ్యంలో గాజా సిటీ, ఖాన్ యూనిస్ రేవుల వద్ద ఉన్న హమాస్ నౌకలను ఇజ్రాయెల్ పేల్చివేసింది.

ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి..
Israel Vs Palestine : ఇజ్రాయెల్ తాజాగా ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గాజా వైపు నుంచి హమాస్ దాడి చేస్తుండగా.. లెబనాన్, సిరియా నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. హమాస్ దాడి మొదలుపెట్టిన రెండో రోజే లెబనాన్ భూభాగం నుంచి దాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్లను ప్రయోగించింది. తాజాగా ఇజ్రాయెల్ పోస్టులపై లెబనాన్ చెందిన ఈ గ్రూపు యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. ఈ రెండు దేశాల మధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడుల్లో లెబనాన్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి.

సిరియా నుంచి కూడా..
Syria Attack Israel Today : మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. తాజాగా శతఘ్ని దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఇప్పటికే సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం ఇస్తోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్లు, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. 1967లో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకొన్న నాటి నుంచి ఈ రెండు దేశాలతో వివాదం తీవ్రమైంది.
అత్యవసర ఐక్యత సర్కారు ఏర్పాటుకు అంగీకారం
Emergency Unity Government In Israel : ఇజ్రాయెల్‌లో అత్యవసర ఐక్యతా సర్కారుతోపాటు వార్ క్యాబినెట్ ఏర్పాటుకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, విపక్ష నాయకుడు బెన్నీ గంట్జ్ అంగీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది. విభేదాలను పక్కనపెట్టి అత్యవసర ఐక్యత సర్కారు సాధ్యాసాధ్యాలపై శనివారం రాత్రి కూడా విపక్ష నేతలు యాయిర్ లాపిడ్, బెన్నీ గంట్జ్‌తో ప్రధాని నెతన్యాహు చర్చలు జరిపారు.
Gaza Power Cut : ఏకైక విద్యుత్ కేంద్రం మూత.. అంధకారంలోకి 'గాజా'.. జనరేటర్లకు కూడా..