Israel Palestine Conflict : హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడులతో ధ్వంసమవుతున్న గాజా పరిస్థితి అత్యంత దుర్భరంగా మారుతోంది. విద్యుత్ కోతలు, ఇంధనం కొరత కారణంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఆహారం, నీరు కూడా అరకొరగానే అందుతున్నాయి. అది కూడా ఈజిప్టు నుంచి వస్తున్న సాయమే. గాజాను దిగ్భంధించిన ఇజ్రాయెల్ మాత్రం ఆహారం, నీరు మాత్రమే పంపుతోంది. ఇంధనం పంపేందుకు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడుల్లో గాయపడిన ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వేల మంది క్షతగాత్రులతో గాజా పట్టిలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వారందరికీ చికిత్స చేసే సౌకర్యాలు, విద్యుత్, నీరు లేక వైద్యులు కూడా ఏమీచేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోతున్నారు.
నిమిషాల్లోనే ప్రాణాలు గాల్లోకి..
Gaza Situation Now : గాజాలో నగరంలోని అల్ షిఫా ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. ఇంధనం కొరత కారణంగా పలు ఆస్పత్రుల్లో శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల్లో వ్యవధిలోనే అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు. అదే జరిగితే ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులను కాపాడుకోలేమని ఓ వైద్యుడు కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం సైతం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన అనేక మందిని అక్కడికి తీసుకొచ్చారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ఒకపక్క గాయాలు చేసే నొప్పి, మరోపక్క సరైన వైద్యం అందక పిల్లలు పడే బాధ, ఆక్రందన చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. వారికి పూర్తిస్థాయిలో చికిత్స అందించలేక వైద్యులు, ఓదార్చలేక తల్లితండ్రులు తీరని వేదనను అనుభవిస్తున్నారు.
బందీలను వదిలేదాకా..
అల్ షిఫా ఆసుపత్రిలో పడకలులేక కొత్తగా వస్తున్న క్షతగాత్రులను కిందనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఈజిప్టు నుంచి వస్తున్న ట్రక్కుల్లో ఔషదాలు మాత్రమే ఉంటున్నాయి. ఇంధనం రాకపోవడం వల్ల నీటి శుద్ధి, ఆసుపత్రులను శుభ్రం చేసే పనులు నిలిచిపోయాయి. బందీలందరినీ విడుదల చేసేదాకా తాము ఇంధనం, విద్యుత్ సరఫరా చేయబోమని ఇజ్రాయెల్ భీష్మించుకుని కూర్చుంది. దీంతో రోగులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వేలల్లో మృతులు, క్షతగాత్రులు..
అక్టోబర్ 7 నుంచి ప్రారంభమైన ఈ మారణహోమంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5,087మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్టు గాజా అధికారులు వెల్లడించారు. వీరిలో 2,055 మంది చిన్నారులు, 1,119 మంది మహిళలే ఉన్నారన్నారు. మరోవైపు 15వేల మందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిపారు.
Israel Hamas War : 'రసాయన దాడులకు హమాస్ మాస్టర్ ప్లాన్.. మా వద్ద ఆధారాలున్నాయి'