Israel Ground Operation : హమాస్ మిలిటెంట్ సంస్థను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా వందలాది యుద్ధ ట్యాంకులు గాజాలోకి ప్రవేశించాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేత పూర్తయ్యే వరకు దాడులు ఆగబోవన్న నెతన్యాహు ప్రకటన నేపథ్యంలో వందలాది యుద్ధ ట్యాంకులు గాజాలో ప్రవేశించడం కలకలం రేపుతోంది.
హమాస్ మిలిటెంట్లు X ఇజ్రాయెల్ సైన్యం
Israel Hamas War Latest : గాజాలో వైమానిక దాడులతో ధ్వంసమైన శిథిలాల మధ్య ఇజ్రాయెల్ సైన్యం అణువణువు జల్లెడ పడుతోంది. గాజాలోని సొరంగాల్లో దాగిన హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తోంది. గాజాలోని టన్నెల్స్ దాగిన హమాస్ మిలిటెంట్లతో తమకు భీకర పోరు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దళాలు.. గాజాలోని ఉత్తర దక్షిణ రహదారిని లక్ష్యంగా చేసుకుని రెండువైపుల నుంచి భీకర దాడులు చేశాయని గాజాలోని స్థానికులు తెలిపారు. గాజాలోని మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది.
ప్రతి ఇంటికి వెళ్లి..
Israel Hostage Rescue : బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి సైన్యం తనిఖీ చేస్తోంది. ఓవైపు వైమానిక దాడులు, భూతల దాడులు.. మరోవైపు సైనికుల ముమ్మర తనిఖీలతో హమాస్ మిలిటెంట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటివరకు గాజాలో 600కుపైగా హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ చెరలోని మరో సైనికుడిని విడిపించినట్లు తెలిపింది. ఇటీవలే నలుగురు బందీలను హమాస్ విడుదల చేయగా.. ఒక మహిళా సైనికురాలిని ఇజ్రాయెల్ విడిపించుకుంది.
అణువణువూ..
Israel Hamas Conflict : గాజాలో హమాస్ మిలిటెంట్లు తలదాచుకునేందుకు వేలాది సొరంగాలు.. ఉన్నాయన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం అణువణువు గాలిస్తోంది. సొరంగాల్లో నక్కిన మిలిటెంట్లను చాలామందిని ఏరిపారేశామని తెలిపింది. భూతల దాడులతో గాజాలో హమాస్ పాలనను భూస్థాపితం చేస్తామని.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Hamas Vs Israel Army : హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన యాంటీ ట్యాంక్ క్షిపణులను.. రాకెట్ లాంచ్ పోస్ట్‌లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సొరంగాలను తనిఖీ చేస్తున్న తమపై హమాస్ మిలిటెంట్లు మెషిన్‌గన్‌లతో దాడులకు తెగబడుతున్నారని.. ఆ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నట్లు వివరించింది. గాజాలోని వందలాది హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై సమన్వయంతో వైమానిక, భూతల దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అడ్మిరల్ డేనియల్ హగారి వెల్లడించారు. హమాస్‌కు మద్దతుగా ఇరాన్ అనుకూల హెజ్బొల్లా దళాలు రంగంలోకి దిగాయని.. వారితోనూ భీకర యుద్ధం జరుగుతోందని వివరించారు. తమ ఫైటర్ జెట్‌లు హెజ్బొల్లా ఉగ్రసంస్థకు చెందిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని హగారి తెలిపారు.
హమాస్‌ను పూర్తిగా తుడిచి పెట్టేవరకు తమ యుద్ధం ఆగబోదన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనతో గాజాపై దాడులు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కాల్పుల విరమణ అంటే హమాస్ ముందు ఇజ్రాయెల్ లొంగిపోవడమే అని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బందీల విడుదలపై చర్చలు జరిపే అవకాశాన్ని హమాస్‌కు ఇచ్చేందుకే భూతల దాడులను మరింత తీవ్రం చేయలేదని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. పాలస్తీనా పౌరులకు ఇంధనం, ఆహారం, నీరు, విద్యుత్తు నిలిపేశారన్న వార్తలపైనా ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇజ్రాయెల్ నుంచి దక్షిణగాజాకు పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. గాజాలో ఇప్పటివరకు 8 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్లారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
Israel Gaza War : దుర్భర పరిస్థితుల్లోకి గాజా.. ఇంటర్నెట్ బంద్.. ఇజ్రాయెల్ టార్గెట్ రీచ్!