Israel Ground Invasion Gaza : రెండో దశ యుద్ధం మొదలు పెట్టామని ప్రకటించిన ఇజ్రాయెల్... అందుకు అనుగుణంగానే ఒకపక్క గాజాపై రాత్రంతా బాంబుల వర్షం కురిపిస్తూనే మరోవైపు భూతల దాడులను ఉద్ధృతం చేసింది. గగనతలం నుంచి, సముద్రం నుంచి దాడులు చేస్తూనే గాజాలో భూతల దాడులను మరింత విస్తరించింది. ట్యాంకులు, ఇతర ఆయుధాలతో గాజాలోకి ప్రవేశించి హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. హమాస్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. దాడులు ప్రతిదాడులతో శనివారం రాత్రంతా ఉత్తర గాజాలో పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో అనేక మంది రోగులతో పాటు ఆశ్రయం పొందుతున్న పౌరులు ఉన్నారు.
Israel Ground Attack : 3 వారాలతో పోల్చితే బాంబుల దాడి మరింత పెరిగిందని గాజా వాసులు చెబుతున్నారు. 23లక్షల జనాభా ఉన్న గాజాలో ఇప్పటికే విద్యుత్ నిలిచిపోయింది. తాగు నీరు, ఆహారం కరవైంది. ఐక్యరాజ్య సమితి సహాయ బృందాల ద్వారా ఈజిప్ట్ పంపే కొంచెం సాయం మినహా వారికేమీ దొరకడంలేదు. దాడుల్లో గాయపడిన వారితో గాజాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. శుక్రవారం రాత్రి జరిగిన దాడుల తర్వాత ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. పాలస్తీనా ఆరోగ్యశాఖ చెప్పిన ప్రకారం మృతుల సంఖ్య 7,700 దాటింది. వారిలో ఎక్కువ మంది పిల్లలు, చిన్నారులే ఉన్నారని తెలిపింది.
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-1.jpg)
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-2.jpg)
కాల్పుల విరమణకు నో
మరోవైపు తక్షణ కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. తాము యుద్ధం మొదలు పెట్టలేదని, యుద్ధాన్ని కోరుకోనూలేదని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ దాడిచేసిందని.. పౌరులపై కాల్పులు జరిపిందని ఆరోపించింది. ఇవి రెండు యుద్ధ నేరాలనేనని పేర్కొంది. యుద్ధం నూతన దశకు చేరుకుందని IDF అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి తెలిపారు. గాజాలో హమాస్ తీవ్రవాదులు అక్కడి ప్రజలను కవచంలా అడ్డుపెట్టుకుని పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాబట్టి పౌరులంతా గాజా దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాలని కోరారు. ఈజిప్ట్ ద్వారా వచ్చే మానవతా సాయాన్ని మరింత విస్తరిస్తామని IDF ప్రకటించింది.
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-3.jpg)
Israel Ground Operation Gaza : గాజాలో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు.. అక్కడ తమ దేశ జెండాను ఎగరవేసినట్లు జెరూసలేం పోస్ట్ తెలిపింది. 52వ బెటాలియన్‌కు చెందిన 401వ బ్రిగేడ్ సైనికులు గాజా నడిబొడ్డున ఇజ్రాయెల్ జెండాను ఎగరవేసినట్లు వెల్లడించింది. హమాస్ దాడిని తాము మర్చిపోమని, విజయం సాధించే వరకు పోరాటం ఆపబోమని.. సైనికులు నినాదాలు చేసినట్లు జెరూసలెం పోస్ట్ పేర్కొంది. ఇజ్రాయెల్ రెండో స్వాతంత్ర్యం కోసం పోరాడుతోందన్న ఆ దేశ ప్రధాని నెతన్యాహు.. ఇది దీర్ఘకాల పోరాటమైనప్పటికీ తాము సిద్ధమైనట్లు చెప్పారు. మాతృభూమి రక్షణ కోసం ఇజ్రాయెల్ పోరాడుతోందని, తాము తగ్గబోమని ఆయన శనివారం ప్రకటించారు.
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-4.jpg)
గిడ్డంగుల్లోకి చొరబడి సరకుల చోరీ
Israel Humanitarian Aid : మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవతా సాయం అందించే నిత్యావసర సరకులు కోసం గాజా ప్రజలు ఎగబడుతున్నారు. నిత్యావసర సరకులను నిల్వ ఉంచిన గిడ్డంగుల్లోకి వందలాది మంది పౌరులు చొరబడి.. సరకులను ఎత్తుకెళ్లారు. ఆహారం కోసం పౌరులు ఇలా ఎగబడడం చాలా దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోందని UNRWA ఏజెన్సీ డైరెక్టర్ థామస్ వైట్ చెప్పారు.
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-8.jpg)
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-9.jpg)
![Israel Ground Invasion Gaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-10-2023/19887389_1-10.jpg)
Israel Gaza War : దుర్భర పరిస్థితుల్లోకి గాజా.. ఇంటర్నెట్ బంద్.. ఇజ్రాయెల్ టార్గెట్ రీచ్!