Israel Cities Empty : హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లోని ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. 24 గంటలు రద్దీగా ఉండే టెల్ అవీవ్ నగరం ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. వీధులు, ప్రధాన కూడళ్లలో కూడా జనాల రద్దీ గణనీయంగా తగ్గింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించడం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
గాజా పట్టీ నుంచి వేలాది రాకెట్లను హమాస్ మిలిటెంట్లు టెల్ అవీవ్, జెరూసలెం సహా ఇజ్రాయెల్‌లోని ప్రధాన పట్టణాల లక్ష్యంగా ప్రయోగిస్తుండడం వల్ల ఇజ్రాయెలీలు భయం గుప్పిట బతుకుతున్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్, పాలస్తీనాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు తమ భూభాగంలో 1500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్ భారీగా సైనికులను మోహరించింది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌లో ఎక్కడా హమాస్ మిలిటెంట్లతో పోరు జరగడం లేదని తెలిపింది. గాజా సరిహద్దులు పూర్తిగా తమ అధీనంలో ఉన్నట్లు తెలిపింది.
రంగంలోకి రిజర్వు ఆర్మీ..
Israel Reserve Army : ఇజ్రాయెల్‌లో యుద్ధ సమయంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా 18 ఏళ్ల వయసు ఉన్న పౌరులు సైన్యంతో కలిసి పనిచేయాలి. ప్రతిఒక్కరూ కనీసం 24 నుంచి 32 నెలలు సైన్యంలో సేవ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మినహాయింపు ఇస్తారు. శత్రుదేశాల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో సైనిక సమీకరణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం హమాస్‌పై ఓవైపు గగనతలం నుంచి యుద్ధవిమానాలతో విరుచుకుపడుతుండగా.. మరోవైపు సరిహద్దు ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం నిమగ్నమైంది. దీనికోసం 3 లక్షల రిజర్వు సైన్యాన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దింపనుంది.
నిర్బంధ సైనిక సేవలను ఇజ్రాయెల్ అమలు చేస్తోంది. ఈ సేవలందించిన వారు రిజర్వు డ్యూటీలో పనిచేయవచ్చు. పైలట్ల వంటివారు కూడా వాలంటీర్‌గా కొనసాగవచ్చు. వీరే కాకుండా నటీనటులు, జర్నలిస్టులతోపాటు అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. కేవలం దేశ సరిహద్దులనే కాకుండా తమ కుటుంబాలు, ఇళ్లను రక్షించుకోవడమే దీని ఉద్దేశమని రిజర్వు ఆర్మీ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇలా తమ కుటుంబాలను వదిలి కదనరంగంలోకి వెళ్తున్న కొందరు రిజర్వు సైనికుల ఫొటోలను ఇజ్రాయెల్ రక్షణ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తమకు ఎటువంటి ముప్పు వచ్చినా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌తోపాటు ఇజ్రాయెల్ పౌరులు ఏకమై సంయుక్తంగా పోరాడుతామని తెలిపింది.