Indonesia boat accident: ఇండోనేసియాలో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న కార్గో పడవ సులవేసీ రాష్ట్రం సమీపంలోని మకస్సార్ జలసంధిలో మునిగిపోయింది. ప్రయాణికుల్లో 25 మంది ఆచూకీ గల్లంతైంది. గురువారం ఉదయం మకస్సార్ ఓడరేవు నుంచి పాంగ్కెప్ రీజెన్సీలోని కల్మాస్ ఐలాండ్‌కు వెళ్లాల్సిన ఈ పడవ.. వాతావరణం అనుకూలించక నీటిలో మునిగిపోయిందని అధికారులు తెలిపారు. 17 మందిని కాపాడినట్లు స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న రెంటు టగ్ బోట్లు కొంతమందిని రక్షించాయని చెప్పారు.
Indonesia boat sink: మునిగిపోయిన పడవ ప్రదేశం గురించి తాజాగా సమాచారం అందిందని, అక్కడకు సహాయక సిబ్బందిని పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండు మోటార్ బోట్లు, ఓ సహాయక పడవ, స్థానిక మత్స్యకారుల పడవలు, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మునిగిపోయిన పడవ ప్యాసింజర్ ఫెర్రీ అని తొలుత వార్తలు రాగా.. అధికారులు వాటిని కొట్టిపారేశారు. నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రిని పడవ మోసుకెళ్తోందని వివరించారు. పడవ సిబ్బంది ఆరుగురేనని.. మరో 36 మంది ప్రయాణం కోసం అందులో ఎక్కారని తెలిపారు.
17వేలకు పైగా దీవుల సమూహమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఇక్కడి ప్రజలు ప్రయాణానికి ఫెర్రీలను అధిక సంఖ్యలో ఉపయోగిస్తుంటారు. భద్రతా నిబంధనలు సరిగా అమలు కాకపోవడం వల్ల.. ప్రమాదాలు సంభవిస్తుంటాయి. 2018లో ఓ ఫెర్రీ సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్లి నీటిలో మునిగిపోయింది. 200 మంది ప్రయాణికులు పడవలో ఉండగా.. 167 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999లో జరిగిన ప్రమాదం ఆ దేశంలోనే అతిపెద్ద దుర్ఘటనగా నిలిచిపోయింది. ప్యాసింజర్ షిప్ మునిగిపోవడం వల్ల 332 మంది ప్రయాణికుల్లో 312 మంది చనిపోయారు.
ఇదీ చదవండి: