India China Corps Commander Talks : భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు మరోసారి జరగనున్నాయి. ఇప్పటి వరకు 18 సార్లు ఈ అంశంపై సమావేశాలు జరగ్గా.. సోమవారం 19వ దఫా చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా.. భారత్, చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి. 18వ దఫా చర్చలు ఏప్రిల్ 23న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు జరగనున్నాయి. చుషుల్-మోల్డో సరిహద్దులో భారత్ వైపు ప్రాంతంలో ఈ చర్చలు జరగనున్నట్లు సమాచారం.
గల్వాన్ లోయలో ఘర్షణలు..
Galwan Valley Incident : 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు జరిగాయి. ఇరు దేశాల జవాన్లు పరస్పరం దాడులు జరుపుకున్నారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పాయారు. అయితే తమవైపు ఎంత మంది మరణించారన్న దానిపై.. సరైనా వివరాలు చెప్పలేదు. మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు అప్పట్లో పేర్కొన్నాయి. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి.. ఇరు దేశాలు సైన్యాలను మోహరించాయి. క్రితం జరిగిన చర్చలతో చాలా ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ముగిసినా.. కొన్ని కీలక పాయింట్లైన.. దెప్సాంగ్, దెమ్‌చోక్ వంటి ప్రాంతాల విషయంలో చైనా ససేమిరా అంటోంది.
సరిహద్దు వివాదం..
China India Border Dispute : భారత్-చైనాల మధ్య 3,488 కిలో మీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్ మాత్రం దానిని ఖండిస్తోంది. ఇదే ఇరుదేశాల మధ్య ఉన్న ప్రధాన వివాదం. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం కోసం ఇరుదేశాలు పలుసార్లు చర్చలు జరుపుతూనే వస్తున్న అవి పూర్తి స్థాయిలో సఫలం కావట్లేదు.
అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్ వివాదాలు..
1962లో జరిగిన యుద్ధంలో.. భారత భూభాగంలోకి చైనా బలవంతంగా చొచ్చుకొచ్చింది. భారత అధీనంలో ఉండే అక్సాయిచిన్లోని 34 వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆక్రమించింది. భారత్‌కు తూర్పున ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం చైనా తనదిగా చెప్పుకుంటోంది. ఆ ప్రాంతాన్ని లోయర్ టిబెట్‌గా చైనా పరిగణిస్తోంది. బ్రిటీష్ హయాంలో ఆయా ప్రాంతాల్లోని స్థానిక పాలకులు చేసుకున్న ఒప్పందాలను చైనా లెక్కచేయడంలేదు.
'సరిహద్దులో శాంతి లేకుంటే సత్సంబంధాలు కష్టమే'... చైనాకు రాజ్‌నాథ్ గట్టి సందేశం
లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకుల గర్జన.. సింధూ నదిని దాటి శత్రువులపై దాడి!