Imran khan Pakistan: పాక్ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఎన్నో ఆభరణాలను మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అమ్ముకున్నారని, దుబాయ్‌లో విక్రయించిన రూ.5.9 కోట్ల విలువైన వజ్రాల నగలు కూడా అందులో ఉన్నాయని ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. శుక్రవారం ప్రధానమంత్రి తన నివాసంలో సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఖజానా నుంచి తీసుకొన్న ఓ గడియారం ఇప్పటికీ ఇమ్రాన్ చేతికి ఉందన్నారు. ఈ ఆరోపణలను ఇమ్రాన్‌ఖాన్ వర్గీయులు ఖండించారు. కాగా, నగల ఆరోపణలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించింది.
ఇమ్రాన్‌ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని 'పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్' (పీటీఐ) పార్టీలో తలెత్తిన తిరుగుబాటు కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రధాని సర్దార్ అబ్దుల్ ఖయ్యుం నియాజి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఇమ్రాన్ ఏరి కోరి నియమించిన నియాజిపై సొంత పార్టీకి చెందిన 25 మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన వైదొలగక తప్పలేదు. పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్ తన్వీర్ ఇలియాస్‌కు తిరుగుబాటు సభ్యులంతా మద్దతు పలుకుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ సభ విశ్వాసం కోల్పోయి పదవీచ్యుతుడైన వారం రోజుల్లోపే మరో పీటీఐ నేత అవిశ్వాసం దెబ్బకు పదవిని వదులుకోవడం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (1) ప్రకారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నియాజీ పీవోకే అధ్యక్షుడైన సుల్తాన్ మహమూద్ చౌధ్రీని ఉద్దేశించి లేఖ రాశారు. పార్టీ మేనిఫెస్టో అమలు చేయలేకపోయారని, బంధుప్రీతి ఎక్కువైందని ప్రత్యర్థులు ఈయనపై ఆరోపణలు చేస్తున్నారు.
భారత్ ఆమోదించని ఎన్నిక: ఏడాది కిందట.. 53 స్థానాలు గల పీఓకే చట్టసభలో ఇమ్రాన్ పార్టీ 32 స్థానాలు సాధించగా, నియాజీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆక్రమణను కప్పిపుచ్చడానికి ఇది పాక్ చేస్తున్న వృథా ప్రయాసగా అభివర్ణించింది. పాక్‌లో 'ఆజాద్ కశ్మీర్'గా పిలుచుకునే ఈ భూభాగం స్వతంత్రతను చాటుకునేందుకే ఇక్కడ ప్రధాని, అధ్యక్ష పదవులను ఏర్పాటు చేశారు.
నవాజ్ పాక్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయండి: పలు అవినీతి కేసుల కారణంగా పాక్ వీడి, లండన్‌లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (72) ఇప్పట్లో మళ్లీ సొంతగడ్డపై అడుగు మోపే పరిస్థితులు కనిపించడం లేదు. సోదరుడు షెహబాజ్ షరీఫ్ ఇటీవల పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నవాజ్ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్‌కు కొత్త ప్రభుత్వం ఎటువంటి దౌత్యపరమైన పాస్‌పోర్టు జారీ చేయరాదని, ఆయన పాక్‌లో అడుగు పెట్టిన వెంటనే అధికారులు అరెస్టు చేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది నయీం హైదర్ దాఖలు చేసిన పిటిషనుపై హైకోర్టు పైవిధంగా స్పందించింది.
ఇమ్రాన్ మాజీ భార్య ఇంటి ఎదుట నిరసనలు: 'నన్ను, నా పిల్లలను లక్ష్యంగా చేసుకొని మా ఇంటి ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. పాక్ రాజకీయాలతో నాకు, నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలు సామాజిక మాధ్యమాల్లో కూడా లేకుండా గుట్టుగా బతుకుతున్న ప్రయివేటు వ్యక్తులు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. మళ్లీ 90ల నాటి లాహోర్‌ను, 'పురానా పాకిస్థాన్'ను చూస్తున్నట్టుంది' అంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆవేదన పంచుకొన్నారు. లండన్‌లో ఉంటున్న జెమీమా ఇంటి ఎదుట 'పాకిస్థాన్ ముస్లింలీగ్ - నవాజ్' (పీఎంఎల్ - ఎన్) పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో ఆమె ఇలా సుతిమెత్తగా విరుచుకుపడ్డారు. ఇదే నగరంలో ఉంటున్న పీఎంఎల్ - ఎన్ నేత, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అపార్ట్‌మెంటు ఎదుట ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ఇటీవల ఆందోళనలు చేశారు. దానికి బదులుగా అన్నట్లు నవాజ్ పార్టీ నేతలు ముఖాలపై క్రాస్ గుర్తు వేసిన ఇమ్రాన్‌ఖాన్, ఆయన పిల్లల చిత్రాలతో జెమీమా ఇంటి ఎదుట నిరసన ప్రదర్శనలకు సిద్ధమయ్యారు. పీఎంఎల్ - ఎన్ నేత అబిద్ షేర్ అలి దీనిపై మాట్లాడుతూ 'ఈ పరిస్థితికి ఇమ్రానే బాధ్యుడు. మా ఆందోళనలు శాంతియుతంగా చేస్తున్నాం' అన్నారు. ఇమ్రాన్, జెమీమాల వైవాహికబంధం తొమ్మిదేళ్ల తర్వాత 2004లో ముగిసింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై మారని పాక్ వైఖరి.. భారత్‌తో సంబంధాల మాటేమిటి?