Mass shooting at Houston: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్‌లోని సూపర్ మార్కెట్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించిన ఘటన మరవకముందే మరోసారి కాల్పులు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో దుండగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
ఇద్దరు మృతి: హోస్టన్ సూపర్ మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో తుపాకులతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. నిందితుల్లో ఒకరు గాయాలతో ఆస్పత్రి పాలుకాగా.. మరో ఇద్దరిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో అమాయక ప్రజలు గాయపడలేదని చెప్పారు. వీరి నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరూ 20 ఏళ్ల వయసు గల వారేనని పోలీసులు చెప్పారు.
Mass shooting at California: కాలిఫోర్నియా నగరంలోని చర్చ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. అతడి వద్ద నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఇదీ చదవండి: సూపర్ మార్కెట్‌లో దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి