Hafiz Saeed Sentence : ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, జమాత్- ఉద్- దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉగ్ర సంస్థలకు నిధుల సమకూరుస్తున్నాడనే 7 కేసుల్లో దోషిగా తేలడం వల్ల పాకిస్థాన్ న్యాయస్థానం అతడికి 78 ఏళ్ల జైలు శిక్షను విధించినట్లు తెలిపింది. 2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి-1267ఆంక్షల కమిటీ, హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న అతడు, 2020 ఫిబ్రవరి 12 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ తన సవరించిన ఎంట్రీలో పేర్కొంది.
గత నెలలో సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ అల్-ఖైదా ఆంక్షల జాబితాలోని వ్యక్తులు, సంస్థలపై కొన్ని రికార్డులకు సవరణలు చేసింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, సయీద్ డిప్యూటీ అయిన హఫీజ్ భుట్టావి మరణించినట్లు ధృవీకరణ జరిగిందని UN తెలిపింది. ఉగ్రవాద నిధుల కేసులో శిక్ష అనుభవిస్తూ గతేడాది మేలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ జైలులో అతడు మరణించాడని చెప్పింది. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాది సయీద్‌ను తమకు అప్పగించాలని డిసెంబర్‌లో పాకిస్థాన్‌ను భారత్ కోరింది. అందుకు పాక్ నిరాకరించింది.
26/11 దాడుల సూత్రధారి
26 11 Attack : 2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక హఫీజ్ సయీద్ కీలక సూత్రధారి. ఈ దారుణంతోపాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన పాత్ర పోషించాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు స్థాపించిన లష్కరే తొయిబాను ఐరాసతో పాటు భారత్, యూకే, అమెరికా, ఈయూ, ఆస్ట్రేలియా, రష్యా ఉగ్రసంస్థగా గుర్తించాయి. హఫీజ్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.
హఫీజ్ సయీద్ ఇంటి బయట పేలుడు- నలుగురికి మరణశిక్ష
'హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించండి'- పాక్‌ను కోరిన విదేశాంగ శాఖ