Georgia Mass Shooting : అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. జార్జియా రాష్ట్రం హెన్రీ కౌంటీలోని హాంప్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల కారణంగా నలుగురు దుర్మరణం చెందారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని హాంప్టన్ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ వెల్లడించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. లాంగ్‌మోర్ హాంప్టన్ నివాసి అయిన ఆండ్రీ లాంగ్‌మోర్ అనే 40 ఏళ్ల వ్యక్తిపై తమకు అనుమానం ఉన్నట్లు తెలిపారు. ఇక తదుపరి విచారణ కోసం రంగంలోకి దిగిన డిటెక్టివ్.. హత్య జరిగిన ప్రాంతంలోని నాలుగు చోట్లను పరిశీలిస్తున్నారంటూ పేర్కొన్నారు.
హత్య చేసిన తర్వాత దాదాపు అదే ప్రాంతంలో నిందితుడు ఐదు గంటల పాటు ఉన్నట్లు సమాచారం. లాంగ్‌మోర్ గురించి సమాచారం అందిస్తే 10వేల డాలర్లను రివార్డుగా ఇస్తామని హెన్నీ కౌంటీ పోలీస్ ఉన్నతాధికారి స్కాండ్రెట్ ప్రకటించారు. 2023లో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 31 కాల్పుల ఘటనలు జరగ్గా అందులో దాదాపు 153 మంది ప్రాణాలు కోల్పోయారు.
గురుద్వారాలో కాల్పులు..
అమెరికాలోని ఓ గురుద్వారాలో జరిగిన కాల్పుల వల్ల ఇద్దరు ఆస్పత్రిపాలయ్యారు. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందంటూ పోలీసులు వెల్లడించారు. అందులో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించామంటూ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర్ కీర్తన్ వేడుకలు జరుగుతున్న గురుద్వారా పరిసరాల్లో.. తొలుత ఇద్దరు వ్యక్తులు మధ్య ఓ చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరికిపై చేయి చేసుకున్నారు. అది కాస్త కాల్పులకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే, కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కావని.. ఇద్దరు పరిచయస్థుల మధ్య జరిగిన వాగ్వాదం అని పోలీసులు స్పష్టం చేశారు.