Gaza Food Crisis : గాజాలో యుద్ధం భీకరంగా సాగుతుండటం వల్ల అక్కడ తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. సోమవారం రఫా సరిహద్దు దాటి గాజాలోకి వచ్చిన మానవతా సాయం ట్రక్కులపై గుంపులుగా ఎగబడిన ప్రజలు ట్రక్కుల్లోని సామగ్రిని అందినకాడికి తీసుకపోయారు. ఇజ్రాయెల్ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటం వల్ల గాజాలో మానవతాసాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాంతో గాజా ప్రజలకు ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చివరికి తుపాకీల సాయంతో ట్రక్కులను తరలిస్తున్నారు.
Gaza Food Shortage : ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. కరెంటు, తిండి పక్కనబెడితే ఇప్పుడు గుక్కెడు మంచి నీళ్లను సాధించడమే అక్కడి ప్రజల జీవన్మరణ సమస్యగా మారింది. మందుల దుకాణాల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యవసర సరకుల కోసం భారీగా తొక్కిసలాట జరిగింది. మానవతాసాయం ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
బందీలు సజీవంగా బయటపడరు : హమాస్
మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకపడింది. ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ హెచ్చరించడం వల్ల ఐడీఎఫ్ బలగాలు దాడుల తీవ్రతను పెంచాయి. బందీలను విడిపించుకునేందుకు తాము చేయగలినదంతా చేస్తామని ఇజ్రాయెల్ పునరుద్ధాటించింది. హమాస్ వద్ద ఇంకా 138 మంది బందీలు ఉన్నట్లు యూదు దేశం చెబుతోంది. బందీలు పూర్తిగా విడుదల కాకపోవడం వల్ల నెతన్యాహు సర్కార్ ఇజ్రాయెలీల నుంచి ఒత్తిడిని ఎదుర్కుటోంది. మరోవైపు గాజాలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మంగళవారం సమావేశమవుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు తెలిపారు. కాల్పుల విరమణ కోసం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడం వల్ల ఐరాస అధ్యక్షుడు జనరల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంచరించుకుంది.
7వేల మంది హమాస్ మిలిటెంట్లు హతం- గాజాలో 90 శాతం మందికి ఆహారం కరవు!
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల మోత- మానవతాసాయం ట్రక్కులకు బ్రేక్‌లు- ఎటు చూసినా ఆకలి కేకలే!