Floods in Pakistan: ఓవైపు వరదలు.. మరోవైపు అంటువ్యాధులతో పాకిస్థాన్ విలవిలలాడుతోంది. ఇప్పటికే దేశంలో సగభాగం వరద గుప్పిట్లో ఉండిపోగా.. తాజాగా కలుషిత నీటి వల్ల సంక్రమించే వ్యాధుల విజృంభణ మొదలయ్యింది. వరదల కారణంగా నిరాశ్రయులైన లక్షల మందికి తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న వేళ అంటువ్యాధుల విజృంభణ సవాలుగా మారినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లో వరదల వల్ల మొదలైన ఈ అంటు వ్యాధుల విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
వరద ప్రభావిత ప్రాంతాల పౌరుల కోసం దేశవ్యాప్తంగా తాత్కాలిక శిబిరాలను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 5లక్షల మందిని శిబిరాలకు తరలించినట్లు సమాచారం. ఇదే సమయంలో సింధ్ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియా, చర్మ వ్యాధులతోపాటు కంటి ఇన్‌ఫెక్షన్ల ప్రాబల్యం అధికంగా ఉందని అక్కడి ఆరోగ్యశాఖ పేర్కొంది. కేవలం సింధ్ ప్రావిన్సులోనే గడిచిన 24 గంటల్లో 90 వేల డయేరియా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వీటితోపాటు కలరా, ఇతర సంక్రమిత వ్యాధులు పెరుగుతున్నందున ప్రత్యేక వైద్య శిబిరాలు , మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నామని సింధ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ అజ్రా ఫజల్ పేర్కొన్నారు.
భారీ వర్షాల దాటికి వణిపోయిన పాకిస్థాన్‌లో చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మగ్గిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వరదల కారణంగా ఇప్పటివరకు 1191 మంది ప్రాణాలు కోల్పోగా.. 3.3కోట్ల మందిపై ప్రభావం పడింది. దాదాపు పది లక్షల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐరాస అంచనా ప్రకారం, 64లక్షల మంది పౌరులకు తక్షణ మనవతా సహాయం అవసరమని పేర్కొంది. అందులో దాదాపు 6,50,000 గర్భిణిలు ఉన్నారని.. వచ్చే నెల రోజుల్లోపే 73వేల మంది ప్రసవించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి వైద్య సదుపాయాలు వీలైనంత త్వరగా కల్పించడంపై దృష్టి పెట్టాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది.
ఇవీ చదవండి: 50 వేల జవాన్లతో రష్యా సైనిక విన్యాసాలు.. భారత్, చైనా సహా!
మోదీ, జగన్‌పై అమెరికా కోర్టులో డాక్టర్ దావా.. పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారంటూ..