EU Ban on Russian Coal: ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూ దేశాలు మళ్లీ సరికొత్త ఆంక్షలను విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుపై దెబ్బకొట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపై ఈయూ దేశాలు నిషేధం విధించాయి. చాలా హేయమైన మారణకాండలు జరుగుతున్నందున రష్యాపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డేర్ లేయన్ తెలిపారు. ఆంక్షలలో 4 బిలియన్ యూరోల బొగ్గుతో పాటు మరిన్ని ఉత్పత్తులు ఉన్నాయి. యూరప్ ఆర్థిక మాంద్యం భారిన పడుతుందని రష్యా ఇంధన వనరులపై ఆంక్షలను విధించే సాహసం ఇప్పటివరకు ఈయూ దేశాలు చేయలేదు. కానీ ప్రస్తుత నిర్ణయం ఓ కీలక పరిణామం.
" ఈ కీలక నిర్ణయం యూరప్‌కు ఒక్కదానికే కాదు. ప్రపంచం మొత్తం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాం. పుతిన్ యుద్ధంపై, యుద్ధంలో అమాయకపు పౌరుల ఊచకోత, ప్రపంచ ప్రాథమిక విధానాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం"
-ఉర్సులా వాన్‌డేర్ లేయన్, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్
రష్యాకు చెందిన నాలుగు బ్యాంకులు, మరికొంత మంది రష్యా వ్యక్తులపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. అంటే ఈ నాలుగు బ్యాంకులు రష్యా ఫైనాన్సియల్ సెక్టార్లో 23 శాతం మార్కెట్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. రష్యా ఓడరేవులు, ఓడలపై కూడా నిషేధం విధించాయి ఈయూ దేశాలు. అయితే.. వ్యవసాయ, నిత్యావసర వస్తువులపై మినహాయింపు ఇచ్చాయి. 10 మిలియన్ యూరోల విలువ కలిగిన సెమీ కండక్టర్లు, మెషినరీలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం కొనసాగుతుందని ఉర్సులా వాన్‌డేర్ లేయన్ చెప్పారు.
అమెరికా ఆంక్షలు..
ఈయూ దేశాలతో కలిసి అమెరికా కూడా కొత్త ఆంక్షలను విధించింది. రష్యాలో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో మరిన్ని ఆంక్షలను తెచ్చి రష్యాపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకుంది. రష్యా ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లు, ప్రభుత్వ ఆధారిత సంస్థలు, రష్యా ప్రభుత్వ అధికారులపై ఆంక్షలను అమెరికా విధించింది.
ఇదీ చదవండి: రష్యా 'మారణహోమం'.. శవాల గుట్టగా మారిన 'బుచా'