ఇథియోపియా మరోమారు నెత్తురోడింది. జాతుల ఘర్షణతో అట్టుడికింది. ఈ ఘర్షణల్లో దాదాపు 230 మంది బలయ్యారు. అమ్హారా తెగకు చెందిన 200 మందికి పైగా చనిపోయారని, తాను 230 మృతదేహాల్ని లెక్కించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దేశంలోని ఒరోమియా రీజియన్‌లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నరమేధానికి ఓ తిరుగుబాటు సంస్థే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి.
"మేం మా జీవిత కాలంలో చూసిన పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని భయపడుతున్నాను" అని గింబీ కౌంటీకి చెందిన అబ్దుల్ సీద్ తాహిర్ చెప్పారు. శనివారం జరిగిన దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. షాంబెల్ అనే మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. మరో ఘోరమైన దాడి జరిగి తామంతా మరణించడానికి ముందే తమను మరో ప్రాంతానికి తరలించాల్సిందిగా స్థానిక అమ్హారా తెగ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. తాజా మారణ హోమానికి ఒరోమో లిబరేషన్ ఆర్మీ(వోఎల్‌ఏ)దే బాధ్యత అని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులూ ఆరోపించారు. ఈ ఆరోపణలను వోఎల్‌ఏ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ ఖండించారు.
ఇదీ చూడండి: