అమెరికా చీకటి రహస్యాలను బయటపెట్టిన ప్రజా వేగులు ఎడ్వర్డ్ స్నోడెన్, వికీ లీక్స్ సహ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేలపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. వారికి అమెరికా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలా లేదా అన్న అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రజాభిప్రాయాన్ని కోరారు. ఈ పోల్ పెట్టిన గంటల వ్యవధిలోనే 14 లక్షల మందికిపైగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిలో 79శాతం మంది అసాంజే, స్నోడెన్‌లకు క్షమాభిక్ష పెట్టడానికి సానుకూలంగా స్పందించారు. 21 శాతం మంది మాత్రం ఇందుకు వ్యతిరేకించారు.
అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా కార్యక్రమాలకు సంబంధించిన కీలక సమాచారాలను స్నోడెన్,అసాంజెలు బహిర్గతం చేశారు. దీంతో అమెరికా వారి కోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ఎలాన్ మస్క్ తరచూ పోలింగ్ నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణ విషయంలోనూ పోలింగ్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు.