Donald Trump Us Election 2024 : వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు తొలగించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారి 14వ సవరణలోని మూడో సెక్షన్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3మెజార్టీతో న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు.
తిరుగుబాటు చర్యలకు పాల్పడినవారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అనర్హులని అమెరికా రాజ్యాంగంలో ఓ నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ట్రంప్ భవిష్యత్‌ను అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. కొలరాడో కోర్టు తన తీర్పుపై జనవరి 4 లేదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు స్టే విధించింది. అయితే కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ట్రంప్ న్యాయవాదులు తెలిపారు.
ట్రంప్‌కు మద్దతుగా వివేక్ వ్యాఖ్యలు
కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న వివేక్ రామస్వామి మద్దతు ప్రకటించారు. కొలరాడో బ్యాలెట్‌లో ట్రంప్ పేరు చేర్చకుంటే తాను కూడా అక్కడి ప్రైమరీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి కేసులో ట్రంప్ ప్రమేయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్నిగంటల తర్వాత వివేక్ రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కొలరాడో బ్యాలెట్‌లో ట్రంప్ పేరును తిరిగి చేర్చేందుకు కోర్టు అనుమతివ్వకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన మిగితా అభ్యర్థులకు వివేక్ సూచించారు.
ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఆయన అమెరిగా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. తాజాగా ఆయన అదృష్టం అనే పదానికి కొత్త అర్థం చెప్పారు. తన దృష్టిలో లక్ అంటే శ్రమించడమేనని తెలిపారు. ఆ ఫార్ములానే తన జీవితంలో పనిచేసిందని చెప్పారు. ఒక విద్యార్థిగా, వృత్తివ్యాపార జీవితాల్లో అదే తనను ముందుకు నడిపించిందని, ఇప్పుడు దానిని నమ్ముకొనే ముందుకు వెళుతున్నానని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివేక్ తెలిపారు.
'విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కంటే పిజ్జా అవుట్‌లెట్లలో ప్రజలతో సంభాషించడం మేలని భావిస్తున్నాను. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నా ఎన్నికపై పూర్తి విశ్వాసం ఉంది' అంటూ తన ప్రచారం గురించి వివేక్ వెల్లడించారు.
'ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే నేనూ చేయను!- కానీ ఆయన్ను మాత్రం గెలవనివ్వం'
Trump On Gaza Refugees : 'అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం.. సానుభూతిపరులకు నో ఎంట్రీ'