కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. చైనా ప్రయాణ ఆంక్షలను సడలించింది. తన దేశ సరిహద్దులను దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు తెరిచింది. పాస్‌పోర్టు, వీసా సేవలను వచ్చే నెల 8వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు..క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ నివేదిక ఉంటే చాలు... అనుమతిస్తారు. చైనీయులు కూడా విదేశాలకు వెళ్లొచ్చు. దీంతో షీ జిన్‌పింగ్ ప్రభుత్వం గత మూడేళ్లుగా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానానికి దాదాపు స్వస్తి పలికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా కేసులు భారీగా ఉన్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే భారత్, జపాన్ సహా చాలా దేశాలు చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించాయి. హాంకాంగ్ కూడా కొన్ని కొవిడ్ నిబంధనలను సడలించింది.
మన ఔషధాలే దిక్కయ్యాయి
కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కమ్యూనిస్టు చైనాను ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆ దేశవాసులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి భారత్‌వైపు చూస్తున్నారు. వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం అనుసరించిన జీరో కొవిడ్ విధానం ఘోరంగా విఫలమవ్వడం, ఆ దేశం తయారు చేసిన టీకాల ప్రభావం అంతగా లేకపోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ నేపథ్యంలో భారత్ జనరిక్ ఔషధాలకు చైనా బ్లాక్‌మార్కెట్‌లో విపరీతంగా డిమాండు పెరిగింది. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నుట్, మోల్నాట్రిస్.. తదితర మందులను కొనుగోలు చేసేందుకు చైనీయులు డార్క్‌వెబ్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్, చైనా ఫార్మా సంస్థ తయారు చేసిన అజువుడిన్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ చైనాకు అందుబాటులో ఉన్నా.. అవి కొన్ని ఆస్పత్రుల్లోనే లభ్యమవుతున్నాయి. నిజానికి భారత ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు. అయినా ప్రాణాలు రక్షించుకొనేందుకు చైనీయులు రకరకాల మార్గాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు.
పొగమంచు గుప్పిట్లో చైనా
చైనాలోని హెనాన్ ప్రావిన్సు కొన్ని రోజులుగా మంచు గుప్పిట్లో మునిగిపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం జెంగ్‌జువా నగరంలోని జెంగ్‌జిన్ హువాంగే వంతెన ప్రాంతాన్ని పొగమంచు తీవ్రంగా కప్పేసింది. దీంతో ముందున్న వాహనాలు కనిపించక సుమారు 200 వాహనాలు వెనుక నుంచి ఢీకొట్టుకున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయాలపాలయ్యారని.. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చైనా మీడియా వెల్లడించింది. మొత్తంమీద 200 నుంచి 400 వరకు వాహనాలు రోడ్డుపై ఇరుక్కుపోయినట్లు తెలిపింది.