China flight crash black box: చైనాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి ఆ ఘటన ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఆ దారుణానికి పాల్పడినట్లు వివిధ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆ విమానంలో లభించిన బ్లాక్‌బాక్స్ ఆధారంగా చేపడుతున్న దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయని తెలిపాయి. అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మార్చి 21న.. 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. చైనా ఈస్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం.. కున్మింగ్ నుంచి గువాంగ్ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలినప్పుడు పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఇచ్చిన వివరాల ప్రకారం.. వూజౌ నగరానికి నైరుతి దిక్కులో కొంతదూరం ప్రయాణించగానే విమానం నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఘటన జరిగిన సమయంలో విమానం 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : Ukraine Crisis: నాటో సభ్యత్యంపై బేరాలు.. స్వీడన్, ఫిన్లాండ్కు టర్కీ షాక్!