Abdul rehman makki: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 'అంతర్జాతీయ ఉగ్రవాది'గా గుర్తించే ప్రతిపాదనకు చైనా చివర్లో అడ్డుపడింది. ఐరాస భద్రతామండలిలో భారత్, అమెరికాలు ఈ మేరకు చేసిన సంయుక్త ప్రతిపాదనను తాజాగా 'టెక్నికల్ హోల్డ్'లో పెట్టింది. మక్కీని యూఎన్‌ఎస్‌సీలోని ఐఎస్‌ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా జాబితాలో చేర్చాలని జూన్ 1న భారత్, అమెరికాలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను 'నో ఆబ్జక్షన్ విధానం' కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపారు. జూన్ 16 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలోనే చివర్లో చైనా ఈ ప్రతిపాదనను టెక్నికల్ హోల్డ్‌లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం.. దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు.
గతంలోనూ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా.. చైనా ఇదే విధంగా కనీసం నాలుగు సార్లు అడ్డుకుంది. అజర్ కార్యకలాపాలపై మరింత సమాచారం అవసరమైనందున ఆ మేరకు స్పందించినట్లు వాదించింది. చివరకు, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2019లో వెనక్కు తగ్గింది. ఇదిలా ఉండగా.. ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సమీప బంధువు అయిన మక్కీ.. లష్కరే తొయిబా, జమాద్ ఉద్‌దవాలో నాయకత్వ పదవులు కలిగి ఉన్నాడు. భారత్‌లో.. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు రూపొందించడం, నిధుల సేకరణ, యువతను ప్రేరేపించడం వంటివాటి వెనుక అతని హస్తం ఉంది. దేశీయ చట్టాల ప్రకారం భారత్, అమెరికాలు.. ఇప్పటికే మక్కీని ఉగ్రవాదిగా గుర్తించాయి.
ఇదీ చూడండి: అసాంజే అప్పగింతకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం