Shahid Mahmood: డ్రాగన్ దేశం చైనా మరో ఉగ్రవాదికి వంతపాడింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన.. ఆమోదం పొందకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలోని '1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ'లో భారత్, అమెరికా ఈ ప్రదిపాదనను ప్రవేశపెట్టాయి. షాహిద్‌పై ఆంక్షలు విధించాలని సభ్యదేశాలను కోరాయి.
అయితే, పాక్‌కు వంతపాడే చైనా.. ఈ ప్రయత్నాలను అడ్డుకుంది. ఐరాసలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనను నిలిపివేసింది. గడిచిన నాలుగు నెలల్లో చైనా.. ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వడం ఇది నాలుగోసారి. షాహిద్ మహమూద్‌ను అమెరికా ట్రెజరీ శాఖ 2016లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఎవరీ షాహిద్ మహమూద్..?
షాషిద్ మహమూద్ కరాచీలో లష్కరే తోయిబా సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా పనిచేశాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.