Britain New King Parliament : బ్రిటన్‌కు నూతన రాజుగా ఎన్నికైన వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణి, తన తల్లి ఎలిజబెత్‌ను గుర్తు చేసుకున్న ఆయన.. పాలనలో ఆమె దారిలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన తల్లి నిస్వార్థ కర్తవ్య పాలనకు ఉదాహరణగా నిలిచారన్నారు. రాజుగా ఎన్నికైన తర్వాత ఛార్లెస్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉపిరి లాంటిదని అభిప్రాయపడ్డారు ఛార్లెస్. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు సహా దాదాపు 900 మంది హాజరయ్యారు.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా శనివారం అధికారికంగా ప్రకటించారు. చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఛార్లెస్ సతీమణి క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియమ్ సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్(73) పేరును అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరించారు. సంబంధిత పత్రంపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు.
ఒక రాజుగా తన బాధ్యతల గురించి పూర్తి అవగాహనతో ఉన్నానని ఛార్లెస్ వెల్లడించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి (ఎలిజబెత్) జీవితకాలం నిస్వార్థ సేవ, ప్రేమ అందించి, నిదర్శనంగా నిలిచారన్నారు. అలాగే తన సతీమణి కెమిల్లా తనకెప్పుడూ మద్దతుగా ఉన్నారని చెప్పారు.
బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. "ఈ మధ్యాహ్నం(గురువారం) బల్మోరల్‌లో రాణి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు" అని బర్మింగ్‌హమ్ ప్యాలెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి: బ్రిటన్ రాజుగా ఛార్లెస్.. 73ఏళ్ల వయసులో పట్టాభిషేకం
రెండు వారాల్లో ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. 50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో..