యుద్ధం, ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలతో సతమతమవుతున్న వేళ... సామాన్యులకు మరో మంట మొదలైంది. అదే గ్యాస్‌స్టవ్ మంట! ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆందోళన రెకెత్తించటమేగాకుండా... అమెరికాలోనైతే రాజకీయ రంగు పులుముకొని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య వాడివేడి యుద్ధం సాగుతోందీ గ్యాస్‌స్టవ్‌లపై!
ఏంటి సమస్య?
సంపన్నులైనా, సామాన్యులైనా... ప్రతి వంటింటిలోనూ గ్యాస్‌స్టవ్‌లు తప్పనిసరి వస్తువుగా మారిపోయాయి. వీటితో ఆరోగ్య, పర్యావరణ గండం పొంచి ఉందంటూ ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. వెంటనే గ్యాస్‌స్టవ్‌లపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా వినియోగదారుల రక్షణ కమిషన్ (సీపీఎస్‌సీ) ప్రకటించింది. అమెరికా వ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై ఆందోళన మొదలైంది. క్రమంగా అది రాజకీయ రంగు పులుముకొని డెమొక్రాట్, రిపబ్లికన్ రాజకీయ యుద్ధంగా మారుతోంది. అమెరికన్ పార్లమెంటు సభ్యులు సామాజిక మాధ్యమాల్లో గ్యాస్‌స్టవ్‌లపై వాగ్యుద్ధం చేసుకుంటున్నారు. "గ్యాస్‌స్టవ్‌ను వదులుకునే సమస్యేలేదు. అధ్యక్ష భవనంలోని పిచ్చివాళ్లు నా ఇంటికొచ్చి స్టవ్‌ను తీసుకెళ్లే ప్రయత్నం గనక చేస్తే.. అది నా శవం మీదుగానే జరుగుతుంది. రండి దమ్ముంటే" అంటూ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి రోనో జాక్సన్ హెచ్చరించారు.
ఆస్తమాకు కారణం...
ఇటీవల హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్, పర్యావరణ పరిశోధన, ప్రజారోగ్యంపై ఇంటర్నేషనల్ జర్నల్‌లలో గ్యాస్‌స్టవ్‌లపై ఓ నివేదిక ప్రచురితమైంది. దాని ప్రకారం... "వంటకు వాడుతున్న గ్యాస్‌స్టవ్‌ల నుంచి నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లతో పాటు పీఎం 2.5 అనే సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. ఇవన్నీ పర్యావరణానికి హాని చేసేవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పైగా, నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం 2.5లు.. రెండూ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. చిన్నపిల్లల్లో ఆస్తమాకు నైట్రోజన్ డయాక్సైడ్ కారణమవుతుంది. సరైన గాలి వెలుతురు లేని చోట ఈ వాయువులు ఆస్తమానే కాకుండా క్యాన్సర్, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలకూ కారణమవ్వొచ్చు. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం కారణంగా 20 లక్షలమంది పిల్లల్లో ఆస్తమాను గుర్తించారు. వంటకు గ్యాస్‌స్టవ్‌లను ఎక్కువగా వాడుతున్న ఇళ్లలో పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 42శాతం ఎక్కువ. అమెరికాలో తాజా ఆస్తమా కేసుల్లో 12శాతం ఈ గ్యాస్‌స్టవ్‌ల ప్రభావితాలే. 50 ఏళ్ల పరిశోధనల ప్రకారం... ఆరోగ్యానికి, పర్యావరణానికి గ్యాస్‌స్టవ్‌లు హానికారకాలని తేలుతోంది."
ఈ వివరాలు వెలువడగానే... అమెరికా సీపీఎస్‌సీ స్పందించింది. "గ్యాస్‌స్టవ్‌లతో గండం పొంచి ఉంది. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించేవాటిని నిషేధిస్తాం. గ్యాస్‌స్టవ్‌లపై నిషేధం విధించే ఆలోచనుంది" అని సీపీఎస్‌సీ కమిషనర్ వెల్లడించారు. ఇది అమెరికా సామాన్య ప్రజానీకంతో పాటు సంపన్న కుటుంబాల్లోనూ ఆందోళనకు కారణమైంది. అనేకమంది అధికార డెమొక్రాట్ ప్రతినిధులు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. గ్యాస్‌స్టవ్‌లను వదిలి ఎలక్ట్రిక్ స్టవ్‌లకు మారటమంటే ఖర్చు పెరిగిపోతుంది. నెలనెలా కూడా ఇంధన బిల్లు పెరుగుతుందనేది అందరి ఆందోళన. వంటింట్లో గాలివెలుతురు వచ్చేలా ప్రజల్ని అప్రమత్తం చేయాలిగానీ గ్యాస్‌స్టవ్‌లపై నిషేధం విధించటం సరికాదన్నది వారి వాదన. ఈ ఆందోళనలతో సీపీఎస్‌సీ కూడా కాసింత వెనక్కి తగ్గింది. "నిషేధం ఆలోచనే తప్ప నిర్ణయం కాదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కొత్త గ్యాస్‌స్టవ్‌లకే అది వర్తిస్తుంది. పాతవాటికి కాదు" అని సీపీఎస్‌సీ వివరణ ఇచ్చింది.
ఎందుకు ప్రమాదం?
కొన్ని పరిశోధనల ప్రకారం.. వంటవండేప్పుడు గ్యాస్‌స్టవ్‌ల నుంచి నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లతో పాటు పీఎం 2.5 అనే పదార్థాలు విడుదలవుతాయి.
ఎలాంటి ప్రమాదం?
ఇవి ఆస్తమా, క్యాన్సర్, గుండెజబ్బులకు దారితీయొచ్చు.
మరి దారి?
వంటింట్లో గాలివెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవటం
వీలైతే ఎలక్ట్రిక్ స్టవ్‌కు మారటం