Afghanistan Earthquake 2023 : అఫ్గానిస్థాన్‌లో ఇటీవల భూకంపం ధాటికి 2 వేల మందికి పైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. హెరాత్ ప్రావిన్స్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని U.S. జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత కూడా పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. తాజా భూకంపంపై అఫ్గానిస్థాన్ అధికారిక వర్గాలు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఇటీవల సంభవించిన భూకంపంలో 2 వేలకు పైగా ప్రజలు మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో బుధవారం మరోసారి భూకంపం సంభవించింది. అయితే, ఇప్పటికే భూకంపంతో కకావికలమైన ఆ ప్రాంతంలో ప్రజలెవరూ లేరని తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా శిథిలాలతోనే నిండిపోయి ఉందని సమాచారం.
జేసీబీతో శిథిలాల తొలగింపు.. అన్నీ మృతదేహాలే!
కాగా, ఇదివరకు సంభవించిన భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అఫ్గాన్ అధికారులు, ప్రజలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి ఈ తరహా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా సురక్షితంగా బయటపడతారన్న ఆశతో శిథిలాల దిబ్బలను తవ్వుతున్నారు. అయితే, చాలా వరకు మృతదేహాలే బయటపడుతున్నాయి. కొందరు తమ కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపిస్తే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
భారీగా సామూహిక అంత్యక్రియలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
అలాగే బుల్డోజర్లతో తమవారి అంత్యక్రియల కోసం సమాధులు తవ్వుతున్నారు. హెరాత్ ప్రావిన్స్‌లోని 20 గ్రామాల పరిధిలో 2వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబన్లు తెలిపారు. ఆ ఇళ్లు కూలిపోవడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సోమవారం భూకంప ప్రభావిత ప్రాంతాన్ని తాలిబన్లు ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతకేగాక అఫ్గానిస్థాన్‌లోని జిందా జాన్ ప్రాంతానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు సైతం వెళ్లారు. వారు అక్కడ జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు.
Israel Cities Empty : నిర్మానుష్యంగా ఇజ్రాయెల్ నగరాలు .. బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడుపుతున్న ప్రజలు