Ant Population In World : ఈ భూగోళంపై నివసిస్తున్న మానవుల కంటే చీమల సంఖ్యే ఎక్కువని అందరికీ తెలిసిందే. అయితే భారీగా ఉండే చీమల సంఖ్య ఎంత అంటే చెప్పడం అసాధ్యమే. ఎందుకంటే వాటి సంఖ్య లెక్కకట్టడం అంత తేలికైన విషయం కాదు. కానీ హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసానికి పూనుకున్నారు. చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా 489 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు. భూమిపై 20,000,000,000,000,000 లేదా 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని అంచనా వేశారు. కానీ వాటి సాంద్రత దృష్ట్యా కచ్చితమైన సంఖ్యను మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపారు.
ఈ పరిశోధనలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘చీమలు సర్వవ్యాప్తి చెందడం వల్ల చాలా మంది ప్రకృతి శాస్త్రవేత్తలు భూమిపై వాటి ఖచ్చితమైన సంఖ్యను చెప్పలేకపోతున్నారు. అయితే, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చీమల సాంద్రతలను కొలిచే 489 అధ్యయనాల నుంచి డేటాను సంకలనం చేయడం ద్వారా సంఖ్యలను అంచనా వేశాం’ అని పరిశోధకుల బృందం వెల్లడించింది. ఈ సంఖ్యను 20 క్వాడ్రిలియన్‌లుగా విభజించినట్లు తెలిపింది.
భూగోళం మీద చీమల బయోమాస్‌ను కూడా ఈ బృందం వెల్లడించింది. 12 మిలియన్ టన్నులుగా పేర్కొంది. (ఓ ప్రాంతం లేదా వాల్యూమ్‌లోని జీవుల మొత్తం పరిమాణం కానీ బరువును సూచించడాన్ని బయోమాస్ అంటారు) అడవిలో నివసించే పక్షులు, క్షీరదాల మొత్తం బరువు కలిపి సుమారు 2 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపింది.
ఇదీ చదవండి: స్కూల్‌పై సైన్యం దాడి.. 13 మంది బలి.. మృతుల్లో ఏడుగురు పిల్లలు
ఉక్రెయిన్‌కు షాక్.. ఆ ప్రాంతాల విలీనానికి రష్యా యత్నం.. త్వరలో రెఫరెండం!