కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్య 100 కోట్ల పైకి ఎగబాకనుందని ఓ ప్రముఖ నివేదిక పేర్కొంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రపంచ దేశాల్లోని పేదలు 500 మిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా వేసింది. ముఖ్యంగా పేదరిక స్థాయికి కాస్త ఎగువన ఉన్న జనాభా ఎక్కువగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని తెలిపింది. ఈ మేరకు కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనాన్ని శుక్రవారం నివేదిక రూపంలో విడుదల చేశాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా బంగ్లాదేశ్, భారత్, ఇండోనేసియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రభావితం కానుందని నివేదిక తెలిపింది. అభివృద్ధి దేశాల్లో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని హెచ్చరించింది. రోజుకి 1.90 డాలర్ల లోపు ఆదాయం ఉన్నవారిని నిరుపేదలుగా లెక్కగడతామని.. అటువంటి వారి సంఖ్య 700 మిలయన్ల నుంచి 1.1 బిలయన్లకు చేరనుందని నివేదిక అంచనా వేసింది. సరైన చర్యలు తీసుకోకపోతే.. పేదరికాన్ని రూపుమాపడంలో గత 30 ఏళ్లలో సాధించిన ఫలితాలన్నీ తుడిచిపెట్టుకుపోనున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ ఆండీ సమ్నర్ పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి సమ్నర్ మూడు మార్గాలను సూచించారు.
- పేదరికంపై కొవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఒక అంతర్జాతీయ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి. దీనికి ఓ ప్రపంచ స్థాయి నాయకుడు నేతృత్వం వహించాలి. ప్రభావిత దేశాలకు ఎంతమేర ఆర్థిక సాయం కావాలో గుర్తించాలి. ఈ క్రమంలో ధనిక దేశాలు తమ వంతు సాయాన్ని అందించాలి.
- అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చే రుణాలను వీలైనంత వేగంగా విడుదల చేయాలి. ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలను 2020 చివరి వరకు అవసరమైతే 2021 వరకు నిలిపివేయాలి.
- సంక్షోభం సద్దుమణిగిన తర్వాత రుణాల్ని పునర్‌వ్యవస్థీకరించాలి. అవసరమైతే కొన్ని దేశాలకు పూర్తిగా రద్దు చేయాలి. తద్వారా లాభపడ్డ దేశాలు ఆ నిధులను ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఉపయోగించాలి.
పై మూడు అంశాల్ని అమలు చేయడం ద్వారా కొవిడ్-19 వల్ల ఏర్పడ్డ పేదరిక సమస్యను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉందని సమ్నర్ సూచించారు.
ఇదీ చూడండి: జులైలో 30 వేల మందిపై 'మోడెర్నా టీకా' ప్రయోగం!