ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను బ్రిటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్వెడార్ రాజకీయ ఆశ్రయాన్ని విరమించుకున్న వెంటనే పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించిన కీలక సమాచారాన్ని బహిర్గతం చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది వికీలీక్స్.
7లక్షల70 వేల పత్రాలు బహిర్గతం
2010: జూన్-అక్టోబరు మధ్యకాలంలో అగ్రరాజ్యం అమెరికా దౌత్యవిధానాలకు సంబంధించిన 7లక్షల 70వేల రహస్య పత్రాలను వికీలీక్స్ బహిర్గతం చేసింది. ఇందులో అఫ్గానిస్థాన్, ఇరాక్లతో యుద్ధ వివరాలూ ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే అమెరికా దౌత్య కార్యకలాపాలకు సంబంధించి మరో 2లక్షల 50వేల పత్రాలనూ విడుదల చేసి సంచలనం సృష్టించింది వికీలీక్స్.
ఆ మరుసటి నెలలోనే ఇద్దరు స్వీడన్ మహిళలను లైంగికంగా వేధించారని అసాంజేపై అరెస్టు వారెంటు జారీ చేశారు స్వీడన్ న్యాయవాది. ఈ ఆరోపణలను ఆసాంజే ఖండించారు. వేధింపులకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.
2010 డిసెంబరు: లండన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు అసాంజే. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. తనపై బురద జల్లేందుకే స్వీడన్ తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు అసాంజే.
2011: అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలని లండన్ కోర్టు అదేశించింది. స్వీడన్ తనను అమెరికాకు అప్పగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు అసాంజే. అమెరికా సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఆ దేశం కఠిన శిక్షలు విధిస్తుందని అసాంజేకు తెలుసు.
2012 జూన్: లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందారు అసాంజే. అక్కడే తలదాచుకుంటానన్న అసాంజే అభ్యర్థనను ఈక్వెడార్ అంగీకరించింది.
2018 జనవరి: అసాంజే సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు కావాలని ఈక్వెడార్ అడిగింది.
2018 ఫిబ్రవరి: ఆరోగ్య కారణాల దృష్ట్యా తనపై ఉన్న అరెస్టు వారెంటును రద్దు చేయాలన్న అసాంజే అభ్యర్థనను బ్రిటన్ అంగీకరించలేదు.
ఇతర దేశాల విషయాల్లో తలదూర్చొద్దన్న ఒప్పందాన్ని అతిక్రమించినందుకు 2018 మార్చిలో అసాంజేతో సంబంధాలు కొనసాగించొద్దని ఈక్వెడార్ నిర్ణయం తీసుకుంది.
2018 అక్టోబరు: దౌత్య కార్యాలయంలో ఉంటున్న అసాంజేపై కొత్త ఆంక్షలు విధించింది ఈక్వెడార్. వాటిని పాటించకపోతే ఆశ్రయాన్ని విరమించుకుంటామని హెచ్చరించింది.
2018 నవంబరు: అమెరికా న్యాయవాదులు అసాంజేపై రహస్యంగా మోపిన నేరాభియోగాల వివరాలు పొరబాటున బహిర్గతమయ్యాయి.
దౌత్య కార్యాలయంలో నిబంధనలను అసాంజే తరచూ అతిక్రమిస్తున్నారని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో ఈ నెల మొదట్లో తెలిపారు. అసాంజే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని నిర్ధరించేందుకు ఈ నెల 25న దౌత్య కార్యాలయంలో ప్రత్యేక నిపుణులు విచారణ జరపాల్సి ఉంది.
దర్యాప్తు జరగక ముందే నేడు (ఏప్రిల్ 11న) అసాంజేకు ఆశ్రయం కల్పించడం విరమించుకుంటున్నామని దౌత్య కార్యాలయం ప్రకటన చేసింది. వెంటనే బ్రిటిష్ పోలీసులు అసాంజేను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: బ్రెగ్జిట్ వాయిదా... అక్టోబర్ 31వరకు గడువు