వాణిజ్యం అనేది కొన్ని శతాబ్దాల కిందటి నుంచే ఉంది. ఒక వస్తువును తీసుకోవడం కోసం మరో వస్తువును ఇవ్వడం, ఒక వస్తువును దానికి సరిపడా డబ్బు చెల్లించి దక్కించుకోవడం వాణిజ్యంలో భాగమే. ఈ విధంగానే దేశాలు, సంస్థలు తమకు కావాల్సిన వస్తువుల్ని డబ్బులు చెల్లించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. అయితే ఒకప్పటి సోవియేట్ యూనియన్ తమ దేశంలోకి పెప్సీ సోడాను దిగుమతి చేసుకునేందుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఏకంగా తమ యుద్ధనౌకలను అమ్మేసింది. శీతల పానీయాల కోసం యుద్ధనౌకలు అమ్మేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో మీరే చదవండి..
రష్యాకు పెప్సీ పరిచయం
1959లో అమెరికా, సోవియేట్ యూనియన్ (ఒకప్పటి ఉమ్మడి రష్యా) స్నేహానికి గుర్తుగా, టెక్నాలజీని అమెరికాకు పరిచయం చేసే క్రమంలో సోవియేట్ ప్రభుత్వం న్యూయార్క్‌లో భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అదే ఏడాది అమెరికా తమ ఉత్పత్తులను సోవియేట్‌కు చూపించేందుకు మాస్కోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్‌ను అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియేట్ ప్రిమియర్ నికిట క్రుషేవ్ సందర్శించారు. వీరిద్దరి మధ్య కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం అంశాలపై వాగ్వాదం జరిగింది. ఇది గమనించి.. ఎగ్జిబిషన్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి వచ్చిన పెప్సీ కంపెనీ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు ఎం. కెండల్ ఒక గ్లాస్‌లో పెప్సీ తీసుకొచ్చి నికిట క్రుషేవ్‌కు అందించాడు. దాని రుచి ఆయనకు.. సోవియేట్ అధికారులకు బాగా నచ్చింది. దీనితో ఈ పెప్సీని సోవియేట్‌కి శాశ్వతంగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు.
పెప్సీ దిగుమతికి ఒప్పందం
పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత 1972లో పెప్సీతో సోవియేట్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇక్కడ డబ్బులు చెల్లించే విషయంలో సమస్య ఏర్పడింది. ఆ కాలంలో సోవియేట్ కరెన్సీ రుబెల్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. దీనితో సోవియేట్ యూనియన్ తమ వద్ద తయారు చేసే వోడ్కాను అమెరికాకు ఎగుమతి చేస్తామని, దానికి బదులుగా పెప్సీని దిగుమతి చేయాలని కోరింది. దీనితో ఒప్పందం కుదిరి.. పెప్సీ సోవియేట్‌కు.. వోడ్కా అమెరికాకు ఎగుమతి జరిగింది. సోవియేట్ ప్రజలు పెప్సీ కూల్‌డ్రింక్‌కు ఫిదా అయ్యారు. దీనితో ఆ దేశంలో పెప్సీ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మరోవైపు సోవియేట్ వోడ్కా అమెరికాలో బాగా పాపులరైంది. ఈ వాణిజ్యం ఇరు దేశాల్లో కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ ఆ తర్వాత మరో సమస్య వచ్చి పడింది.
యుద్ధనౌకల అమ్మకం
1980ల్లో సోవియేట్ అఫ్గానిస్థాన్‌పై దాడులు చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోవియేట్ ఉత్పత్తులను అమెరికాలో వాడకూడదని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అక్కడి నుంచి దిగుమతి అయ్యే వోడ్కాను కూడా అమెరికా నిషేధించింది. దీనితో మళ్లీ పెప్సీ-సోవియేట్ ఒప్పందంలో చెల్లింపుల విషయంలో అడ్డంకి ఏర్పడింది. తమ దేశంలో పెప్సీ దిగుమతి ఆగకూడదని భావించిన సోవియేట్ యూనియన్ ఆ సంస్థతో ప్రపంచం విస్తుపోయే ఒప్పందం చేసుకుంది. సోవియేట్‌కు చెందిన 17 సబ్‌మెరైన్‌లు, మూడు యుద్ధనౌకలు పెప్సీకి అప్పగించింది. వాటిని తుక్కు కింద అమ్మేసి వచ్చిన డబ్బును తీసుకొని పెప్సీని తమ దేశానికి సరఫరా చేయాలని కోరింది. వీటి విలువ 3 బిలియన్ డాలర్లు (ప్రస్తుత విలువ రూ. 22వేల కోట్లు). ఈ ఒప్పందానికి పెప్సీ ఒప్పుకోవడం వల్ల ఆ యుద్ధనౌకలు కొంతకాలం పెప్సీ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ తర్వాత వీటిని తుక్కుగా మార్చేందుకు ఓ స్వీడెన్ కంపెనీకి ఇచ్చేసింది. విశేషమేమిటంటే.. పెప్సీ ఆధీనంలో యుద్ధ నౌకలు ఉన్న సమయంలో పెప్సీ ప్రపంచంలోనే అత్యధిక నావిక సైనిక శక్తి ఉన్న సంస్థగా నిలిచింది.
ఇదీ చూడండి:కరోనా అంతమైనా 'వర్క్ ఫ్రం హోం' సంప్రదాయం