భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్ రకం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పాకింది. ఇప్పటివరకు 44 దేశాల్లో ఈ రకం వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం వెల్లడించింది. బి.1.617లో అనేక ఉప రకాలు ఉన్నాయి. ఇది జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం. ఈ స్ట్రెయిన్ తొలిసారిగా భారత్‌లో బయటపడగా.. 44 దేశాలు అప్‌లోడ్ చేసిన 4500 నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
భారత్ వెలుపల.. యూకేలో ఈ వైరస్ రకం కేసులు అత్యధికంగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గతవారం భారత్ స్ట్రెయిన్‌ను ఆందోళనకర రకంగా వర్గీకరించింది డబ్ల్యూహెచ్ఓ. దీంతో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్ రకాల జాబితాలో బి.1.617ను కూడా చేర్చింది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి సాధారణ కరోనా వైరస్‌తో పోలిస్తే తీవ్రంగా ఉందని, చాలా దేశాల్లో ఈ రకం వల్ల కేసులు వేగంగా పెరిగాయని, అందుకే దీన్ని ఆందోళనకర జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈ స్ట్రెయిన్ మూలంగానే భారత్‌లోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'
అయితే దీంతో పాటు భారత్‌లో వైరస్ ఉద్దృతికి ఇతర కారణాలూ ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కరోనాను మరిచి మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించడం, అక్కడ భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని అభిప్రాయపడింది. ఏప్రిల్ చివరి నాటికి బి.1.617లోని 'బి.1.617.1', 'బి.1.617.2' రకాలు భారత్‌లో గుర్తించినట్లు తెలిపింది. దీంతో పాటు బ్రిటన్‌లో వెలుగుచూసిన బి.1.1.7 రకం స్ట్రెయిన్ కూడా దేశంలో వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు: కేంద్రం
బి.1.617ను.. 'భారత్ రకం స్ట్రెయిన్' డబ్ల్యూహెచ్‌ఓ ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. భారత రకం కరోనా వైరస్ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది.
"బి.1.617 వైరస్ స్ట్రెయిన్ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి.1.617ను 'భారత వేరియంట్' అని పేర్కొన్నారు. ఆ వార్తలు నిరాధారం, అవాస్తవం. బి.1.617ను భారత రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు. కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా 'భారత్' అనే పదం లేదు"అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
డబ్ల్యూహెచ్ఓ వివరణ
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. వైరస్‌లకు, వైరస్ రకాలకు దేశాల పేర్లను డబ్ల్యూహెచ్ఓ పెట్టదని సంస్థ దక్షిణాసియా విభాగం వెల్లడించింది. శాస్త్రీయ పేర్లతోనే వాటిని పిలుస్తామని తెలిపింది. ప్రతిఒక్కరూ దీన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: కొవిడ్ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్!