రష్యా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు చేసి పరీక్షించింది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. పరీక్షల తుది దశలో ఉన్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా టీకా లేదని స్పష్టం చేసింది.
అయితే రష్యా వ్యాక్సిన్‌పై ఓ నిర్ణయానికి వచ్చేందుకు తమ వద్ద పూర్తి సమాచారం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌కు సీనియర్ అడ్వైజర్ అయిన డాక్టర్ బ్రూస్ అయిల్వార్డ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ గురించి అవగాహనకు వచ్చే విధంగా అదనపు సమాచారం కోసం రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని బట్టి ట్రయల్స్ నిర్వహించిన తీరు, పాటించిన దశల గురించి తెలుసుకోనున్నట్లు చెప్పారు.
కొవిడ్ టీకాను ఆమోదించినట్లు రష్యా ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ టీకా ట్రయల్స్ పూర్తి కాలేదని శాస్త్రవేత్తలను అనుమానిస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండానే వైరస్ ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు.