WHO on Covid Variants: రెండేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా మహమ్మారి ఇప్పటికీ మానవాళిని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తూనే ఉంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా రూపం మార్చుకుని మళ్లీ పడగ విప్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తాజా ఉపవేరియంట్ BA-2 వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఇది అంతకుముందు ఉన్న ఉపవేరియంట్ BA-1 కన్నా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.
ఇప్పటికే ఒమిక్రాన్ వచ్చిన వారికి ఈ ఉపవేరియంట్ మళ్లీ సోకుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక శాస్త్రవేత్త మరియా వాన్ కెర్కోవ్ తెలిపారు. ఆమె ఇంకా ఏం అన్నారంటే..
- పలు దేశాల్లో ఒక్కసారిగా పెరిగి.. అదే స్థాయిలో కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది.
- ఈ కొత్త ఇన్‌ఫెక్షన్లకు BA-2 ఉపవేరియంట్ కారణమా కాదా అన్నది ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షిస్తోంది.
- ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త ఉపవేరియంట్ కారణంగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు రాలేదు.
- తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, మరణాల నుంచి రక్షించేందుకు కరోనా వ్యాక్సిన్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.
- టీకాలు వేసుకోవాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
World covid cases: ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం నాటికి కొవిడ్ కేసుల సంఖ్య 40 కోట్లు, మరణాలు 57 లక్షలు దాటినట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కొవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి 40 కోట్ల 2 లక్షల 44 వేల 31 కేసులు, 57 లక్షల 61 వేల 208 మరణాలు సంభవించినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడిన అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య భయాందోళనలు రేపుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 7.7 కోట్ల కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి అగ్రరాజ్యంలో 9 లక్షల 8వేల మంది బలయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 19 శాతం, మరణాల్లో 15 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. 4.2 కోట్ల కేసులతో భారత్ రెండో స్థానంలో, 2.6 కోట్ల కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో నిలిచాయి.
తగ్గుతున్న కేసులు..
World corona cases WHO Report: గడిచిన వారంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 17 శాతం తగ్గినట్లు పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతకుముందు వారంతో చూస్తే.. అమెరికాలోనే 50 శాతం తగ్గుదల కనిపించిందని స్పష్టం చేసింది. మరణాలు కూడా 7 శాతం మేర తగ్గాయని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని, తీవ్ర అనారోగ్యం బారినపడకుండా చేస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఉద్ఘాటించింది.
ఇవీ చూడండి: 17 శాతం తగ్గిన కరోనా కేసులు- అమెరికాలో సగానికి..