కరోనా మూలాలు కనుగొనే అంశంలో చైనా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). కొవిడ్-19 మూలాలపై పరిశోధన చేసేందుకు నిపుణుల కమిటీ చైనాలో పర్యటించేందుకు అనుమతి నిరాకరిస్తోంది చైనా. వీసా సమస్యలే ప్రధాన కారణంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో.. అనుమతులపై చైనా అధికారులు జాప్యం చేయటం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్ అథనోమ్.
చైనాపై టెడ్రోస్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చాలా అరుదు. డబ్ల్యూహెచ్ఓ, చైనా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చైనాకు బయలుదేరేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
ఈ మేరకు జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైనాపై విమర్శలు చేశారు టెడ్రోస్.
"చైనాకు వచ్చే నిపుణుల బృందానికి అవసరమైన అనుమతులపై డ్రాగన్ అధికారులు తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ వార్తతో నేను తీవ్ర నిరాశకు గురయ్యా. ఇద్దరు శాస్త్రవేత్తలు ఇప్పటికే బయలుదేరగా.. మిగతా వారు చివరి క్షణంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. "
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ అధినేత
ఇదీ చూడండి:టీకాల ఆమోదంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హర్షం