కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనాలు విస్మయపరుస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరికి కరోనా సోకి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. మహమ్మారిపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ ఈమేరకు వెల్లడించారు.
ప్రపంచంలో అధికారికంగా నమోదైన కేసులతో పోలిస్తే... ఈ సంఖ్య 20 రెట్లు అధికంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ... కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేసి, ప్రాణాలు కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఆగ్నేయాసియాలో కొవిడ్ కేసులు భారీగా నమోదవగా... ఐరోపా, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 760 కోట్లుపైనే ఉంటుంది. ఇందులో 76 కోట్ల మందికి వైరస్ సోకిందని డబ్ల్యూహెచ్ఓ అంచనా. అయితే... అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.5 కోట్లుగా ఉండడం గమనార్హం.
ఇదీ చూడండి: పాక్ 'బ్లాక్లిస్ట్' భవితవ్యం తేలేది ఈ నెలలోనే