Ukraine Russia War: క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌తో తాను చర్చలకు సిద్ధమని.. అవి విఫలమైతే మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరు దేశాల నేతలు చర్చలు జరుపుతున్నా ఫలితం దక్కని నేపథ్యంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.
"నేను పుతిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నాను. గత రెండేళ్ల నుంచి రెడీగా ఉన్నా. చర్చలు లేకుండా యుద్ధానికి ముగింపు పలకలేమని నా అభిప్రాయం. పుతిన్‌తో ఏదైనా ఒక పద్ధతిలో చర్చలు జరిపేందుకు అవకాశం రావాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం.. ఇది మూడో ప్రపంచ యుద్ధమేనని అర్థం. మేము ఎప్పుడూ సంప్రదింపులకే పట్టుబడుతున్నాం. చర్చలతోపాటు శాంతిస్థాపనకు ఉన్న పరిష్కారాలను చెబుతూనే ఉన్నాం. ముఖ్యంగా మాస్కోకు మరోసారి చెబుతున్నా.. కలిసి చర్చించుకోవాల్సిన సమయం. ఉక్రెయిన్‌కు న్యాయం జరగడంతోపాటు ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించుకోవాల్సిన సమయం."
-వొలొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
భద్రతా హామీలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడమే చర్చల్లో ప్రధానాంశాలన్న ఆయన.. ఈ యుద్ధం ముగించాలంటే చర్చలు ఒక్కటే మార్గమన్నారు. అంతర్జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ విధంగా పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై సైనిక దాడులను ఉద్ధృతం చేస్తున్న రష్యా వరుసగా రెండో రోజూ హైపర్ సోనిక్ క్షిపణితో విరుచుకుపడింది. శనివారం ఉక్రెయిన్ ఆయుధాగారంపై కింజల్ క్షిపణిని ఎక్కుపెట్టిన పుతిన్ సైన్యం.. ఆదివారం మైకోలైవ్ పోర్టు సమీపంలోని చమురు డిపోను లక్ష్యంగా చేసుకుంది. దీనితో పాటు నల్ల సముద్రం, కాస్పియన్, సముద్రంలోని తమ నౌకల నుంచి ఉక్రెయిన్ పై దాడులు చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ తెలిపారు.
మరోవైపు మేరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్‌పైన కూడా రష్యా సైన్యం బాంబు దాడి చేసింది. ఆ బడిలో దాదాపు 400 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే.. దాడి తర్వాత వారి పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదు.
వారంలో రోజుల్లో 40వేల మంది
వారం రోజుల్లో సుమారు 40వేల మంది మేరియుపోల్ నగరాన్ని వీడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇది ఆ నగర జనాభాలో పది శాతం. మొత్తం 39,426 మంది వారి సొంత వాహనాల్లో మేరియుపోల్ నుంచి వలస వెళ్లినట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 115 మంది చిన్నారులు మృతి..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 115 మంది చిన్నారులు బలి అయ్యారని స్థానిక ఉక్రెయిన్ పార్లమెంట్ ఆదివారం వెల్లడించింది. 140 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. 'ఇవి సంఖ్యలు కావు.. వందలాది ఉక్రెనియన్ కుటుంబాల దుఃఖానికి కొలమానం' అని ఓ ట్వీట్ చేసింది.
902 మంది పౌరులు మృతి.. ఓహెచ్‌సీహెచ్‌ఆర్
రష్యా దాడుల కారణంగా మార్చి 19 నాటికి ఉక్రెయిన్‌లో దాదాపు 902 మంది పౌరులు మృతి చెందారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్‌ఆర్) ఆదివారం తెలిపింది. 1,459 మంది గాయపడ్డారని చెప్పింది. ఫిరంగులు, మల్టీపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగా ఎక్కువ మంది మరణించారని వెల్లడించింది. మేరియుపోల్ తదితర నగరాల నుంచి ఇంకా పూర్తిస్థాయి నివేదికలు రాని నేపథ్యంలో.. మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేసింది.
కోటి మంది నిరాశ్రయులుగా మారారు
రష్యా సైనిక చర్య మొదలు.. ఉక్రెయిన్‌నుంచి పొరుగు దేశాలకు వెళ్లిపోయి శరణార్థులుగా మారినవారు, దేశంలోనే నిరాశ్రయులైనవారి సంఖ్య కోటికి చేరుకుందని ఐరాస శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. సామాన్య పౌరులే ఇబ్బందులు పడతారని, బలవంతంగా ఇళ్లు విడిచి పెట్టాల్సి వస్తుందని చెప్పారు.
ఊచకోతను ఆపండి.. పోప్ ఫ్రాన్సిస్ పిలుపు
ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్రను ఖండిస్తూ.. పోప్ ఫ్రాన్సిస్ తన పరోక్ష విమర్శలను కొనసాగించారు. ఉక్రెయిన్‌లో ఘర్షణను అన్యాయమైన, అవివేకమైన ఊచకోతగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై ఈ హింసాత్మక దురాక్రమణ దురదృష్టవశాత్తు నెమ్మదించడం లేదంటూ ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గుమిగూడిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ యుద్ధాన్ని ఆపమని ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు.
'14,700 మంది రష్యన్ సైనికులు మృతి'
ఇప్పటివరకు 14,700 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 476 ట్యాంకులు, 1487 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 96 విమానాలు, 118 హెలికాప్టర్లు, 21 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. మొత్తం మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.
ఇండో-పసిఫిక్ వ్యూహం కూడా డేంజరే
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దారితీసిన 'తూర్పు యూరప్ వైపు నాటో విస్తరణ' ఎంత ప్రమాదకరమో.. అమెరికా 'ఇండో-పసిఫిక్ వ్యూహం' కూడా అంతే ప్రమాదకరమని చైనా ఉప విదేశాంగ మంత్రి లీ యుచెంగ్ వ్యాఖ్యానించారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ ఫోరంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 'సోవియట్ యూనియన్ పతనం తర్వాత వార్సా ఒప్పందంతో పాటు నాటో కూడా చరిత్రలో కలిసిపోవాల్సింది' అని అభిప్రాయపడ్డారు.
రష్యా, ఉక్రెయిన్‌లు ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయి
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో క్లిష్టమైన సమస్యలపై రష్యా, ఉక్రెయిన్‌లు ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావుసోగ్లు తాజాగా ఓ వార్తాసంస్థకు తెలిపారు. కొన్ని విషయాలపై దాదాపుగా ఏకీభవించాయని వెల్లడించారు. చర్చల క్రమంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి నుంచి ఇరుపక్షాలు వెనకడుగు వేయకపోతే.. కాల్పుల విరమణ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : 'ఆహారం, నీళ్లు ఇవ్వండి ప్లీజ్'.. బతిమలాడుతున్నా కరుణించని రష్యా సైన్యం