Ukraine Russia War: రంజాన్ కదిరోవ్.. అమాయకంగా కనిపించే చెచెన్యా నేతకు అత్యంత క్రూరుడిగా పేరుంది. ప్రపంచంలో ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది పుతిన్ రణనీతి. ఒక వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేయడానికి క్రెమ్లిన్ ఏ స్థాయిలో వ్యూహరచన చేస్తుందో ప్రపంచానికి చూపించింది. తన కీలుబొమ్మ నియంతను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి చెచెన్యా ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేసింది. తాజాగా ఆ కీలుబొమ్మ నియంత ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు చేదోడువాదోడుగా ఉండేందుకు యత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం చెచెన్ ఫైటర్లను ఉక్రెయిన్‌పైకి ఉసిగొల్పుతున్నాడు.
ఎవరీ రంజాన్ కదిరోవ్..?
చెచెన్యా మాజీ అధ్యక్షుడు అహ్మద్ కదిరోవ్ కుమారుడు రంజాన్ కదిరోవ్. మొదటి చెచెన్యా యుద్ధ సమయంలో అహ్మద్ వేర్పాటువాదుల పక్షం వహించగా.. రెండో చెచెన్యా యుద్ధ సమయంలో రష్యాకు అనుకూలంగా పోరాడాడు. దీంతో పుతిన్ ఆశీస్సులతో చెచెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2004లో ఓ బాంబుదాడిలో అహ్మద్ మృతి చెందాడు. అప్పటికి రంజాన్ వయస్సు 30 ఏళ్ల లోపే. దీంతో వయస్సు చాలకపోవడం వల్ల.. అల్కనోవ్‌ను అధ్యక్షుడిగా చేశారు. 2007లో రంజాన్‌కు 30 ఏళ్లు నిండగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. నాటి నుంచి చెచెన్ రిపబ్లిక్ అతని గుప్పిట్లోనే ఉంది.
పుతిన్‌కు వీరవిధేయుడు..
పుతిన్‌కు వీరవిధేయతను బహిరంగంగా ప్రకటించడంలో రంజాన్ కదిరోవ్ ఏనాడూ సంకోచించలేదు. పుతిన్ అతిపెద్ద విమర్శకుల్లో ఒకరైన బోరిస్ నెమత్సోవ్ 2015లో హత్యకు గురయ్యారు. ఆయన రష్యా డిప్యూటీ ప్రధానిగా కూడా పనిచేశారు. అతడిని చంపిన చెచెన్ సెక్యూరిటీ అధికారిని కదిరోవ్ బహిరంగానే పొగిడారు. పొగిడిన మర్నాడే కదిరోవ్‌కు పుతిన్ ప్రభుత్వం నుంచి అత్యున్నత అవార్డు వచ్చింది. సామాజిక సేవ, ఆయన సాధించిన ఘనకార్యాలకు ఈ అవార్డు ఇచ్చినట్లు రష్యా ప్రకటించింది.
సోషల్‌మీడియా అభిమాని..
రంజాన్‌కు సోషల్ మీడియా అంటే విపరీతమైన ఇష్టం. పుతిన్ వలే ఇమేజ్ తెచ్చుకొనేందుకు ఇతడు తరచూ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, జంతువులతో కలిసి ఫొటోలు దిగి వాటిని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పంచుకొనేవాడు. ఇన్‌స్టాలో 2017 నాటికి 1.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా ఆంక్షలు విధించడం వల్ల అతడి ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలను ఆ సంవత్సరం బ్లాక్ చేశారు.
తూర్పు ఉక్రెయిన్‌లో రెబల్స్‌కు ఊతం..
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో పుతిన్ అనుకూల వేర్పాటు వాదులకు రంజాన్ కదిరోవ్ మద్దతు ఉంది. క్రిమియా ఆక్రమణ సమయంలో కూడా రెబల్స్‌కు కదిరోవ్ మద్దతు లభించింది. పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా అమెరికా, ఐరోపా సమాఖ్య కదిరోవ్‌పై ఆంక్షలు విధించాయి. వాస్తవానికి పుతిన్-కదిరోవ్ మధ్య రష్యా బ్యూరోక్రసీకి స్థానం లేదు. దీంతో చెచెన్యా పునర్నిర్మాణం కోసం రష్యా నిధులను సమకూరుస్తుంది. చెచెన్యా రాజధాని గ్రోజ్నిలో రోడ్లు, అందమైన ప్రార్థనా మందిరాలను నిర్మించడం వల్ల కదిరోవ్ ఇమేజ్ పెరిగింది.
కదిరోవ్ కుటుంబం కింద ప్రైవేటు సైన్యం..
1994లో చెచెన్ వేర్పాటువాద మిలీషియాగా ఏర్పాటైన ‘కదిరోవిట్స్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. కానీ.. రెండో చెచెన్ యద్ధ సమయంలో రష్యా ప్రభుత్వంతో కలిసి వీరు వేర్పాటువాదులను అణచివేశారు. ఆ తర్వాత రంజాన్ తండ్రి అహ్మద్ అధికారం చేపట్టాక.. 'కదిరోవిట్స్' అనధికారిక పోలీసులుగా చలామణి అయ్యారు. అహ్మద్ మరణం తర్వాత ఈ ప్రైవేటు సైన్యం పగ్గాలు రంజాన్ చేతికి వచ్చాయి. 2006లో ఈ మిలీషియాను చట్టబద్ధం చేసి.. రష్యా నేషనల్ గార్డ్స్‌లో ఓ విభాగంగా మార్చారు. ఇది మోటరైజ్డ్ రెజిమెంట్‌గా పనిచేస్తోంది. రంజాన్ వ్యక్తిగత రక్షణ బాధ్యతలు దీనికి అప్పగించారు. హత్యలు, దాడులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి వాటిల్లో 'కదిరోవిట్స్' పేరు వినిపిస్తుంది. తన విమర్శకులను రంజాన్ నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేయించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సెర్విన్ మూర్‌ను 2006లో హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. 2009లో మానవహక్కుల కార్యకర్త నటాలియా ఈస్టెమిరోవాను కాల్చి చంపించారు. రెండో చెచెన్ యుద్ధం, సిరియా అంతర్యుద్ధం, ఉక్రెయిన్ ఆక్రమణల్లో 'కదిరోవిట్స్' పాత్ర ఉంది.
ఉక్రెయిన్ ఆక్రమణలో..
ఉక్రెయిన్‌లో రష్యా దళాలకు మద్దతుగా దాదాపు 10వేల మంది సైనికులను పంపిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం రంజాన్ కదిరోవ్ ప్రకటించారు. వీరిలో 'కదిరోవిట్స్' కూడా ఉన్నారు. ఉక్రెయిన్ అధికారులను హత్య చేసినవారికి నజరానాలు ఇస్తానని కదిరోవ్ తన సైన్యానికి హామీ ఇచ్చినట్లు న్యూలైన్ ఇన్‌స్టిట్యూట్ వ్యాసంలో రాసింది. ఉక్రెయిన్ ఆక్రమణ మొదలైన రెండో రోజే వీరు చెచెన్యా రాజధాని గ్రోజ్నీ నుంచి బయల్దేరారు. బెలారస్ మీదుగా వీరు ఉక్రెయిన్‌లోకి చొరబడ్డారు. వీరి వాహనాలపై 'V' సంకేతం ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కానీ, ఉక్రెయిన్‌కు చెందిన ఆల్ఫా గ్రూప్ వీరి ఆర్మ్‌ర్డ్ గ్రూప్‌ను కీవ్‌కు 16 మైళ్ల దూరంలోని హోస్టెమెల్ వద్ద చుట్టుముట్టి ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 70 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. మృతుల్లో రంజాన్ కదిరోవ్ రైట్‌హ్యాండ్‌గా భావించే జనరల్ మాగోమెడ్ తుషాయేవ్ కూడా ఉన్నట్లు ప్రకటించింది. ఇతడు 141 రష్యాన్ చెచెన్ గార్డ్ మోటరైజ్డ్ బ్రిగేడ్‌కు కమాండర్.
ఇదీ చూడండి : వార్ 2.0.. గేర్ మార్చిన పుతిన్.. ఇక విదేశీ ఫైటర్లతో ఉక్రెయిన్‌పై దాడులు!