Stock Market Highlights In 2024 : 2024లో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరికి మదుపరులకు మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. వాస్తవానికి ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ దశలో రికార్డ్ లాభాలను నమోదు చేసి, ఆ తరువాత భారీ నష్టాలను చవిచూశాయి. అయినప్పటికీ దేశీయ సంస్థాగత పెట్టుబడులు పెరగడం, దేశ ఆర్థిక వృద్ధి అశాజనకంగా ఉండడం వల్ల మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి.
మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం, 'ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కార్పొరేట్ ఆదాయాలు, దేశీయ సంస్థాగత పెట్టుబడులు పెరిగాయి. వీటికి తోడు స్థిరమైన ఆర్థిక వృద్ధి ఉండడం వల్ల, సెప్టెంబర్‌లో నిఫ్టీ 26,277.35 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది.
అయితే గత రెండు నెలల్లో, దేశీయ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా 2020 కొవిడ్-19 మహమ్మారి తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో అతిపెద్ద క్షీణతను చవిచూశాయి. పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్లడం వంటివి దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయి.'
మదుపరులకు లాభాలు
2024 డిసెంబర్ 27 నాటికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 6,458.81 పాయింట్లు లేదా 8.94 శాతం మేర లాభపడింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 2,082 పాయింట్లు లేదా 9.58 శాతం మేర లాభాలను ఆర్జించింది.
బుల్స్ Vs బేర్స్
"2024లో బుల్స్ & బేర్స్ మధ్య గట్టి టగ్ ఆఫ్ వార్ జరిగింది. గ్లోబల్ మైక్రోఎకానమిక్ డేటా అంత సానుకూలంగా లేదు. పైగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఒత్తిళ్లు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాయి. మదుపరులకు మంచి రాబడిని అందించాయి.
వాల్యూయేషన్స్ పెరగడం వల్ల ఈ ఏడాది భారతీయ మార్కెట్లు ప్రపంచంలోనే అత్యంత విలువైనవిగా మారాయి. ఫండమెంటల్ థియరీలను అధిగమించి, షేర్ల వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో అనివార్యంగానే మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. ఫలితంగా మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యాయి" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్‌కు చెందిన ప్రశాంత్ తాప్సే అన్నారు.
రికార్డ్ పీక్స్
ఈ ఏడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978.25 వద్ద ఆల్-టైమ్ రికార్డ్ హైకు చేరింది. అదే రోజు నిఫ్టీ 26,277.35 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది.
"మొత్తంగా చూసుకుంటే, భారతీయ ఈక్విటీ మార్కెట్లు గత 9 ఏళ్లుగా (ఈ 2024 వరకు) వరుసగా మదుపరులకు లాభాలు అందిస్తూనే వస్తున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ, మార్కెట్లు మాత్రం బలంగానే నిలదొక్కుకోగలిగాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌లు ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్ని అందించాయి. అయితే యూఎస్ మార్కెట్లలో పోల్చి చూస్తే, బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు బాగా వెనుబడి ఉన్నాయి. దేశం నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా తరలివెళ్లడమే ఇందుకు కారణం" అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెచ్ సంతోష్ మీనా తెలిపారు.
దెబ్బకు దిగివచ్చాయ్
"సెప్టెంబర్‌లో జీవనకాల గరిష్ఠాలను చేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ అక్టోబర్ నెలలో భారీగా క్షీణించాయి. ముఖ్యంగా సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి 8.46 శాతం, నిఫ్టీ గరిష్ఠ స్థాయి నుంచి 9.37 శాతం వరకు దిగివచ్చాయి. ఆఖరి త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాలు నిరాశాజనకంగా ఉండడం, ఆర్థిక వృద్ధి ఆశించిన దానికంటే బలహీనంగా ఉండడమే ఇందుకు కారణం. ఫలితంగా మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడమో, సైడ్‌లైన్స్‌లో ఉండడం జరిగింది" అని సంతోష్ మీనా తెలిపారు.
ఒక్క అక్టోబర్‌లోనే సెన్సెక్స్ 4,910.72 పాయింట్లు లేదా 5.82 శాతం మేర క్షీణించింది. నిఫ్టీ 1605.5 పాయింట్లు లేదా 6.22 శాతం మేర నష్టపోయింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు సెన్సెక్స్ 1,103.72 పాయింట్లు లేదా 1.38 శాతం పడిపోయింది.
భారీగా తరలివెళ్లిన విదేశీ పెట్టుబడులు
అక్టోబర్‌లో రికార్డ్ స్థాయిలో రూ.94,017 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మేశారు. ముఖ్యంగా చైనాకు పెట్టుబడులు తరలివెళ్లడం, కార్పొరేట్ ఆదాయాలు తగ్గడం, జీడీపీ వృద్ధి మందగించడం వల్ల రెండో త్రైమాసికం తీవ్ర నిరాశపరిచింది. ఇవన్నీ దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయి. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం కాస్త ఊరట కలిగించింది.
మార్కెట్లపై ప్రభావం చూపించిన అంశాలు ఇవే!
"2023లో సెన్సెక్స్ 11,399.52 పాయింట్లు లేదా 18.73 శాతం మేర పెరిగింది. నిఫ్టీ 3,626.1 పాయింట్లు లేదా 20 శాతం మేర వృద్ధిచెందింది. అయితే భారత్‌లో జనరల్ ఎలక్షన్స్ జరగడం, ద్రవ్యోల్బణం, యెన్ క్యారీ ట్రేడ్ తగ్గించడం, యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, యూఎస్ ఎన్నికలు, ఆర్బీఐ నిర్ణయాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి" అని వల్లమ్ క్యాపిటర్ అడ్వైజర్స్ సీఈఓ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ మనీశ్ భండారీ అన్నారు.
2025లో ఎలా ఉండబోతుంది?
కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పెట్టుబడిదారుల సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇక లార్జ్ క్యాప్ స్టాక్‌ల పనితీరు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు అనేవి మార్కెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలు, యూఎస్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశముంది.