Natural Face Peeling Treatment: మనలో చాలా మందికి చర్మాన్ని మెరిపించుకోవడానికి అనేక రకాల ఫేషియల్స్ వేసుకుంటుంటారు. ఇంకా వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకోవడం వల్ల మేలు కలుగుతుందని నిపుణులు అంటుంటారు. దీంతో మార్కెట్లు లభించే రకరకాల ఫేస్ పీల్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి వేసుకొనే పీల్స్‌తోనూ ముఖాన్ని మెరిపించుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కీరాదోస: ఇందుకోసం అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. కీరాదోసలోని గుణాలు పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంతో పాటు ముడతలు, గీతల్ని కూడా దూరం చేస్తుందని వివరిస్తున్నారు. 2019లో International Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "The effects of cucumber extract on skin elasticity and hydration" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పైనాపిల్ + బొప్పాయి: ముందుగా అరకప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. అనంతరం అందులో అరచెంచా తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఓసారి, చల్లని నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకోవాలని చెబుతున్నారు. ఇలా తరచూ చేస్తుంటే మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఓట్స్: ఈ ఫేస్ పీల్ కోసం ముందుగా పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఇందులోనే కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. అనంతరం మిశ్రమం కాస్త చల్లబడ్డాక బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ చర్మానికి నప్పే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఈ పీల్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయని నిపుణులు వివరిస్తున్నారు.
అవకాడో: ఇందుకోసం బాగా గిలక్కొట్టిన కోడిగుడ్డులోని తెల్లసొనలో మెత్తగా చేసుకున్న అరచెంచా అవకాడో గుజ్జు, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా 20 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని అంటున్నారు. ఈ ఫేస్ మాస్క్ చర్మంలోని తేమను అధిక సమయం నిలిపి ఉంచేందుకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
అయితే, ఫేస్ పీల్స్ వేసుకున్న తర్వాత ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి సూచిస్తున్నారు. లేదంటే ట్యాన్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జీన్స్ వేసుకునే నిద్రపోతున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కింద కూర్చుని పైకి లేవలేకపోతున్నారా? ఈ సింపుల్ టెస్టులతో క్షణాల్లో మీరెంత బలవంతులో తెలుస్తుందట!