New year 2025 Celebrations in Ramoji Film City : గడిచిన ఏడాది జ్ఞాపకాలను గర్తుకుచేసుకుంటూ నూతన సంవత్సరానికి రామోజీ ఫిల్మ్‌సిటీ కొంగొత్తగా స్వాగతం పలికింది. 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్శకులను ఫిల్మ్‌సిటీ అందాలు కట్టిపడేశాయి. చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించింది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే క్షణాలను ఆనందిస్తూ పర్యాటకులు పసందైన విందును ఆస్వాదించారు. మరచిపోలేని మధురానుభూతులతో కలల లోకంలో విహరించారు. విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకులను ఓలలాడించింది.
దేశంలోనే నంబర్ వన్ డీజేగా పేరొందిన డీజే చేతస్ తన ప్రదర్శనతో పర్యాటకుల్ని ఉర్రూతలూగించారు. డీజే వేదికపై బాలీవుడ్ గీతాలాపన, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశాన్నంటే సందడి మధ్య వీక్షకులు న్యూ ఇయర్ వేడుకని ఘనంగా జరుపుకున్నారు. లైవ్ బ్యాండ్ జోరుతో ఉత్తేజకరమైన వినోదం కలగలిసి సంబురాలు మిన్నంటాయి. నృత్య ప్రదర్శనలు, ఫైర్ యాక్షన్లు, స్టాండప్ కామెడీ షో, జంగిల్ థీమ్ అక్రోబ్యాటిక్ స్టంట్, క్లౌన్, లయన్ కింగ్, స్క్విడ్ గేమ్స్ ఇలా క్షణం తీరిక లేకుండా పర్యాటకులు మధురానుభూతిని పొందారు.
ఆనందడోలికల్లో మునిగితేలిన సందర్శకులు : చివర్లో యువతీ, యువకులు డాన్సులతో ఉర్రూతలూగించారు. గీతాలాపనకు అనుగుణంగా స్టెప్పులేసిన పర్యాటకులు హంగామా చేశారు. కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొని ఆనందడోలికల్లో తేలియాడారు. ఉర్రూతలూగించే డీజేతో ఆకాశమే హద్దుగా సందడి చేసిన యువత, ఘనంగా 2025కు స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకుంటూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. అనంతరం నూతన సంవత్సర వేడుకలు ముగిసిన తర్వాత సందర్శకులు తిరిగి తమ ఇంటికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రామోజీ ఫిల్మ్‌సిటీ సిబ్బంది ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వరకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచింది.
కొత్త ఏడాదికి ఘనం స్వాగతం పలికిన రాష్ట్ర ప్రజలు - తగ్గేదేలే అన్నట్లు సాగిన సెలబ్రేషన్స్
గ్రాండ్ వెల్కమ్ 2025 - కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం - హ్యాపీ న్యూఇయర్