Ukraine Russia News: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్‌కాల్‌లో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండటంపై ఉక్రెయిన్ను మోదీ అభినందించారు.
యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్ తన సహకారాన్ని అందించాలని ప్రధాని కోరారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
"ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితుల గురించి జెలెన్స్కీ.. మోదీకి వివరించారు. ఘర్షణ, దాని ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభంపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. భారత్ ఎల్లప్పుడూ శాంతియుతమైన పరిష్కారాల కోసమే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు."
-ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఇరువురు నేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.
జెలెన్స్కీ ట్వీట్
ఫోన్‌కాల్ అనంతరం ట్వీట్ చేసిన జెలెన్స్కీ.. 'రష్యా దురాక్రమణ'పై మోదీకి వివరించినట్లు చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్నతస్థాయి శాంతి చర్చలు జరగాలని భారత్ కోరుకుంటోందని అన్నారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరులకు సహాయం చేసినందుకు మోదీ అభినందించారని వివరించారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా తాత్కాలిక విరామం