డిసెంబర్ 31లోపు ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా ఫైజర్ టీకా డోసుల సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రణాళికలు రూపొందించినట్లు బ్రిటన్ తెలిపింది. టీకా సరఫరా కోసం వాణిజ్యేతర విమానాల ఉపయోగంపై దృష్టిసారించినట్లు పేర్కొంది.
బ్రిటన్కు వస్తున్న ఫైజర్ టీకాలు బెల్జియంలోని తయారీ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం కొద్దిమొత్తంలో రవాణా అవుతుండగా.. భారీ స్థాయిలో టీకా డోసులు కొత్త సంవత్సరంలో రానున్నాయి. అయితే బ్రెగ్జిట్ ఒప్పందం పూర్తైన తర్వాత ఈయూతో బ్రిటన్ ద్వైపాక్షిక ఒప్పందాలేవీ చేసుకోలేదు. బ్రెగ్జిట్ అనంతర వాణిజ్య ఒప్పందం డిసెంబర్ చివరినాటికి కుదరకపోతే.. బ్రిటన్కు వస్తు రవణాపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
టీకా రవాణా కోసం సరిహద్దులో అన్ని ఏర్పాట్లు చేసినట్లు విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ పేర్కొన్నారు. అవసరమైతే సాయుధ దళాలను రంగంలోకి దించనున్నట్లు చెప్పారు. టీకా ఇప్పుడు చాలా కీలకమైన ఉత్పత్తి అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అందుబాటులో ఉంచేలా చేస్తామని స్పష్టం చేశారు.
బ్రిటన్లో ఈ వారం 8 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 కోట్ల డోసులను బ్రిటన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఇదీ చదవండి: బ్రిటన్లో కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం