బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కార్యాలయంలోని నలుగురు అధికారులు గురువారం విధుల నుంచి వైదొలిగారు. పార్టీ గేటు వ్యవహారంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాన్సన్కు ఈ సమయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది. చీఫ్ స్టాఫ్ డాన్ రోజన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ మార్టిన్ రైనాల్డ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ జాక్ డాలీ, సీనియర్ అడ్వైజర్ మునీరా మీర్జా రాజీనామాలు చేశారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.
కరోనా సంక్షోభ సమయంలో పార్టీగేట్ వ్యవహారంలో రైనాల్డ్ ముఖ్య పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది 2020మే నెలలో 100మంది అధికారులతో బోరిస్ జాన్సన్ గార్డెన్ పార్టీ ఇచ్చారు. అప్పటికి బ్రిటన్లో కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికి ఇలా పార్టీ నిర్వహించడం వల్ల ప్రధానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీగేట్ వ్యవహారంలో సీనియర్ సివిల్ సర్వెంట్ సుగ్రే ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో పరిపాలనా వైఫల్యం,నిర్లక్ష్యం బయటపడింది. దీంతో స్వయానా ప్రధాని జాన్సన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
బోరిస్ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తున్న సమయంలో నలుగురు అధికారులు పదవుల నుంచి తప్పుకోవడం ఆయన్ను మరిన్ని చిక్కుల్లో పడేలా చేసింది.
ఇదీ చదవండి: 'ఉక్రెయిన్పై దాడికి రష్యా కుట్ర'