ఒక బిలియన్ కరోనా టీకా డోసులను ప్రపంచంలోని పేద దేశాలకు ఇవ్వాలని 'గ్రూప్ ఆఫ్ సెవన్' (జీ-7) దేశాలు నిర్ణయించాయి. ఈ టీకా డోసులను ఇచ్చేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. జీ7 ముగింపు సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ మొత్తం డోసులను కొవాక్స్ కార్యక్రమం ద్వారా అందిస్తామన్నారు.
బ్రిటన్ వేదికగా జరిగిన మూడు రోజుల జీ-7 సదస్సు చివరి రోజైన ఆదివారం పలు కీలక తీర్మానాలను చేసింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటంలో భాగంగా అల్పాదాయ దేశాలకు వంద కోట్ల టీకా డోసులను అందించాలని నిర్ణయించింది. ఇందులో తమ దేశీయ ఉత్పత్తుల నుంచి ఎగుమతుల ద్వారా కనీసం 7వందల మిలియన్ డోసులను అందించాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ల సరఫరాలో లాభాపేక్ష లేకుండా ఉండడం సహా స్వచ్ఛంద లైసెన్సింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏడాదికి వంద బిలియన్ డాలర్ల డోసుల నుంచి మరింత పెంచేందుకు జీ-20 దేశాలు, ప్రైవేటు రంగంతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా కోసం రూపొందించిన యాక్ట్-Aకు మద్దతు ఇవ్వాలని జీ7 దేశాలు నిర్ణయించాయి.
వ్యాక్సిన్‌ల సరఫరాతో పాటు పర్యావరణ పరిరక్షణపైనా జీ-7 సదస్సు తీర్మానం చేసింది. కర్బన ఉద్గారాల కట్టడికి అన్ని రకాల బొగ్గు వినియోగాన్ని వీలైనంత త్వరగా తగ్గించాలని నిర్ణయించింది. శిలాజ ఇంధనాల వినియోగానికి ప్రభుత్వ మద్దతును ఆపివేయడం సహా పెట్రోల్, డీజిల్ కార్లను భవిష్యత్తులో తొలగించాలని తీర్మానించింది. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, సుస్ధిర, హరిత అభివృద్ధిని సాధించేందుకు ఏటా వంద బిలియన్ డాలర్లను సేకరించాలన్న లక్ష్యాన్ని సాధించడం కోసం తమ సాయాన్ని పెంచాలని నిర్ణయించింది.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచే పుట్టిందన్న వార్తలపైనా జీ-7 దేశాధినేతలు చర్చించారు.
ఇదీ చూడండి: G-7: చైనాపై పోరుకు బైడెన్ విజ్ఞప్తి!