బ్రిటన్‌లో లేబర్ పార్టీ అభ్యర్థి పరిస్థితి తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లు అయ్యింది! చివరికి సొంత పార్టీ వారి నుంచే తీవ్ర విమర్శలకు గురికావాల్సి వచ్చింది. వెస్ట్‌యార్క్ షైర్‌లోని బ్యాట్లే అండ్ స్పెన్ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం లేబర్ పార్టీ అభ్యర్థి కెయిర్ స్టార్మర్ ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులో భారత ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరచాలనం చేస్తున్న ఫొటోను ముద్రించి, దాని కింద 'మీకు మద్దతివ్వని టోరీ పార్టీ ఎంపీని ప్రమాదంలోకి నెట్టివేయవద్దు' అనే వ్యాఖ్యను జోడించారు. 2018లో జీ7 సదస్సు సందర్భంగా నేతలు దిగిన చిత్రాన్ని లేబర్ పార్టీ అభ్యర్థి ఇందుకు ఉపయోగించారు. ఆ చిత్రం, దాని కింద రాసిన వ్యాఖ్యపై కన్జర్వేటివ్(టోరీ) పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ(లేబర్) నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
భారత్ వ్యతిరేక, విభజించి పాలించే ధోరణికి ఆ కరపత్రం నిదర్శనమని పలువురు దుయ్యబట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత, బ్రిటన్‌కు సన్నిహితమైన దేశ నేత ఫొటోను ఇక్కడి ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించుకోవడం విచారకరమని బ్రిటన్‌లోని భారత సంతతికి ప్రాతినిధ్యం వహించే 'లేబర్ ఫ్రండ్స్ ఆఫ్ ఇండియా' సంస్థ ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. ఆ కరపత్రాన్ని చౌకబారు ప్రచార గిమ్మిక్కుగా లేబర్ పార్టీ ఎంపీ, భారత నంతతికి చెందిన వీరేంద్ర శర్మ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష