లాక్డౌన్ సమయంలో లక్షల పౌండ్ల విరాళాలు సేకరించి అందరి మనసులు గెలుచుకున్న బ్రిటన్ మాజీ యుద్ధ సైనికుడు కెప్టెన్ టామ్ మూరే(100) తుది శ్వాస విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు.. ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: ఆ పెద్దాయన నడిచినందుకే 15 లక్షల పౌండ్ల విరాళం
కొద్దిరోజులుగా న్యుమోనియాకు చికిత్స పొందుతున్న ఆయనకు.. గతవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలుస్తోంది.
3.3 కోట్ల పౌండ్ల సేకరణ
లాక్డౌన్ సమయంలో కరోనా యోధులకు ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనతో.. తన ఇంటి పెరట్లో నడుస్తూ విరాళాలు పోగు చేశారు టామ్. వంద రౌండ్లు నడిచి.. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ కోసం వెయ్యి పౌండ్లు సేకరించాలని తొలుత భావించారు. వయసు వందేళ్లకు దగ్గరపడుతున్న సమయంలోనూ ఇలాంటి ఆలోచనకు పూనుకున్న మూరేను చూసి వేల సంఖ్యలో దాతలు ముందుకొచ్చారు. బ్రిటన్‌తో పాటు అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి విరాళాలు వచ్చాయి. మొత్తం 3.3 కోట్ల పౌండ్లు(దాదాపు రూ.329 కోట్లు) పోగయ్యాయి. మూరే ఆలోచనకు మెచ్చి.. 'సర్' బిరుదుతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 సత్కరించారు.
కాగా, ఆయన మృతిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతాపం ప్రకటించారు. ఆయన నిజమైన హీరో అని కీర్తించారు. దేశానికే కాక ప్రపంచానికి ఆయన ఓ ప్రేరణ అని అన్నారు.
డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
ఇదీ చదవండి: మరోసారి పేలిన స్టార్‌షిప్ నమూనా రాకెట్