బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ 'స్ట్రెయిన్' విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించడంపై జర్మనీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొవిడ్-19 కొత్త రకం స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతున్నందున.. అక్కడి నుంచి వచ్చే విమానాలపై దృష్టి సారిస్తున్నట్టు జర్మనీ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
"బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వ్యాప్తికి సంబంధించిన తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్, బెల్జియంలు నిషేధం విధించాయి. బ్రిటన్‌తో ఉన్న రైలు మార్గాన్ని కూడా బెల్జియం నిలిపేస్తున్నట్లు సమాచారం. దీంతో జర్మనీ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది." అని జర్మనీ ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే.. జర్మనీలో ఇప్పటివరకు కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులేవీ గుర్తించలేదని ప్రముఖ వైరాలజీ విభాగం వైద్యుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ వెల్లడించారు.
బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నామని ఆస్ట్రియా, ఇటలీలు ప్రకటించాయి. అయితే.. ఆ ఆంక్షలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇక యూకే నుంచి వచ్చిన వారిపై చెక్ రిపబ్లిక్ దేశం ఇప్పటికే నిర్బంధ చర్యలకు ఉపక్రమించింది.
బ్రిటన్ నిర్ణయంతోనే..
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోందంటూ.. లండన్‌లో అక్కడి ప్రభుత్వం ఆదివారం నుంచి మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇది మరింత ప్రాణాంతకమైన వైరస్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తీవ్ర అనారోగ్యానికి కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హెన్‌కాక్ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తూ కొత్త రకం స్ట్రెయిన్‌పై నియంత్రణ కోల్పోయాం.. అందుకే దక్షిణ బ్రిటన్‌లో క్రిస్మస్ వేడుకలపై కఠినంగా నిషేధాజ్ఞలు విధిస్తున్నాం.' అని చెప్పారు. యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బెల్జియం, నెదర్లాండ్ దేశాలు ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
ఇదీ చదవండి: మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్