చెక్ రిపబ్లిక్లో క్రీస్తు పూర్వానికి చెందిన ఓ బావిని కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ప్రేగ్‌కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలోని ఓస్ట్రోవ్ పట్టణ సమీపంలో ఈ ఓక్ బావిని కనుగొన్నారు. ఈ బావిని పూర్తిగా కలపతో తయారు చేసినట్లు చెబుతున్నారు. మానవులు తయారు చేసిన అతిపురాతన కలప నిర్మాణం ఇదేనని భావిస్తున్నారు.
ఆక్సిజన్ లేకపోవడం వల్లే
ఇప్పటివరకు తవ్వకాల్లో వివిధ కాలాలకు సంబంధించిన తొమ్మిది బావులను గుర్తించారు. తూర్పు నగరమైన ఓలామాక్లోని పురావస్తు కేంద్రం... ఈ బావిని కనుగొంది. ఈ బావి తయారీకి వాడిన కలప క్రీస్తు పూర్వం 5,255-5,256 మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. ఆక్సిజన్, తడి వాతావరణం లేనుందునే ఈ కలప ఇన్నేళ్లు పాడవకుండా ఉందని స్పష్టం చేశారు.
ఈ బావి నిర్మాణానికి వాడిన కలపను 40 భాగాలుగా చేసి పరిరక్షణ, పునరుద్ధరణకు పార్డుబైస్ విశ్వవిద్యాలయానికి తరలించారు. సెంట్రల్ టౌన్ లిటోమిస్ల్లోని ఓ గదిలో ప్రస్తుతం ఈ ప్రక్రియ జరుగుతోంది.
'కాపాడాలి'
దాదాపు 7,200 ఏళ్లకు పైగా నీటిలో ఉన్న కలపను పాడవకుండా రక్షించాలని పురావస్తు శాస్త్రవేత్త కరోల్ బేయర్ కోరుతున్నారు. ప్రస్తుతం కలప పాడైన చోట నీటిని మార్చడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఆయా భాగాలను అధిక సాంద్రత గల చక్కెర ద్రావణంలో ఉంచారు.
"ఈ కలప ఆరిపోకుండా భద్రపరచడం చాలా ముఖ్యం. దెబ్బతిన్న కలపను మళ్లీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీనితోపాటు కలప దెబ్బతిన్న చోట నీటిని మార్చాల్సి ఉంటుంది. అందుకు అధిక సాంద్రత కలిగిన చక్కెర ద్రావణంలో కలపను ఉంచుతున్నాం."
-- కరోల్ బేయర్, పురావస్తు శాస్త్రవేత్త
నీరు, చక్కెరతో తయారు చేసిన ద్రావణంతో నింపిన కంటైనర్‌లో కలపను నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలపకు ఎక్కువ నష్టం జరగకుండా నివారించవచ్చు. ఈ కలప వార్షిక వలయాల ద్వారా ఏ కాలం నాటిదో గుర్తించారు.
"ఈ కలపను నిల్వ చేసేందుకు అనుకూలమైన పరిస్థితుల్లో ఉంచితే ఎటువంటి ముప్పు ఉండదు. వాతావరణ విపత్తు, అధిక మార్పులు జరిగినట్లయితేనే కలప పాడయ్యే ప్రమాదం ఉంది. "
-- కరోల్ బేయర్, పురావస్తు శాస్త్రవేత్త
నియోలిథిక్ కాలంలోని ప్రజలు కాంస్య యుగ పట్టణ నాగరికతలతో అభివృద్ధి చెందడానికి ముందే కుండలను అభివృద్ధి చేశారని, కొన్ని వందల ఏళ్ల ముందు ఎటువంటి సాధనాలు లేకుండా కేవలం రాయి మాత్రమే ఉన్నప్పుడే మన పూర్వీకులు ఎన్నో నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్త పెస్కా తెలిపారు.
"నియోలిథిక్ కాలానికి చెందిన ఈ బావి ఓక్ కలపతో తయారైంది. ఈ కలప ఆక్సిజన్ లేని, ఎండిన పరిస్థితులు నెలకొన్నంత వరకు పాడవకుండా ఉంటుంది. అప్పుడే ఇది శిలాజంలా మారి వేలాది ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ బావులు తయారు చేయడానికి నాలుగు మూలల్లో 1.4 మీటర్ల పొడవుతో స్తంభాలుగా కలపను ఏర్పాటు చేశారు. తర్వాత వాటి మధ్యలో కలపను పలకలుగా చెక్కి కమ్మీలుగా అమర్చారు. ఆ కాలంలో ఇంత నైపుణ్యం ప్రదర్శించారంటే ఆశ్చర్యమే కదా."
--- జరోస్లావ్ పెస్కా, పురావస్తు శాస్త్రవేత్త
పెస్కా, ఇతర శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లో ప్రచురించారు. 15 నెలల తర్వాత బావి నెమ్మదిగా ఎండిపోతుందని, ఆ తర్వాత ఈ బావిని మ్యూజియంలో ప్రదర్శించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.